జహీరాబాద్, జూలై 6 : సంగారెడ్డి జిల్లాలో పెద్ద ప్రాజెక్టుల్లో ఒక్కటైన జహీరాబాద్ మండలం కొత్తూర్(బి) నారింజ వాగు ప్రాజెక్టు ఏటా నీటితో కళకళలాడుతోంది. వందలాది ఎకరాలకు సాగునీర అందించే ఈ ప్రాజెక్టు అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలతో నారింజ వాగు ప్రాజెక్టులోకి జహీరాబాద్, న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం మండలాల పరిధిలోని వాగులు, వంకలు, చెక్‌డ్యామ్‌ల ద్వారా వరద భారీగా తరలివస్తున్నది.
ఫలితంగా ప్రాజెక్టు గేట్ల మీదుగా వరద కర్ణాటక వైపు వెళ్తున్నది. జహీరాబాద్ ప్రాంతంలోనే పుట్టినా నారింజ వాగు, ఇక్కడి రైతులకు ఉపయోగించుకుంటున్న జలాలు మాత్రం చాలా తక్కువ అని చెప్పవచ్చు. సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన కాలువలు సక్రమంగా లేకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందించే పరిస్థితి లేదు. నారింజ ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నా, కాల్వల ద్వారా అందిస్తే పంటలను పండించుకోవచ్చన్న రైతుల ఆశలు తీరడం లేదు.
నారింజ వాగు నుంచి వృథాగా కర్ణాటకకు తరలిపోతున్న జలాలను కొంతమేర సద్వినియోగం చేసుకునేందుకు జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామ శివారులోని 1970లో అప్పట్లో ప్రభుత్వం నారింజ వాగు ప్రాజెక్టు నిర్మించింది. 1971లో ప్రాజెక్టు కింద 15 కిలోమీటర్ల దూరం కుడి, ఎడమ కాల్వలను తవ్వించింది. నారింజ ప్రాజెక్టు కింద న్యాల్కల్, జహీరాబాద్ మండలాల పరిధిలోని 3500 ఎకరాలకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అయినప్పటికీ ఏ కాల్వ కూడా సాగుకు అనువుగా లేకుండా పోయింది. దీంతో ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో గుంట భూమికి సాగునీరు పారిన దాఖలాలు లేవు. నారింజ ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 85 మిలియన్ క్యూబిక్ ఫీట్లు. గతంలో చేపట్టిన జన్మభూమి, జలయజ్ఞం, మిషన్ కాకతీయ ఫథకాలు ఈ ప్రాజెక్టు దశను మార్చలేకపోయాయి. దీంతో ఏటా వర్షాకాలం ప్రారంభంలోనే ప్రాజెక్టు వరదనీటితో నిండిపోయి గేట్లపై నుంచి నీరు వృథాగా కర్ణాటక వైపు వెళ్తున్నది. ఈ నీరు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలోని నారింజ వాగు ప్రాజెక్టులోకి చేరుతున్నది. అక్కడి రైతులకు సాగునీరు ఎంతగానో ఉపయోగపడుతున్నది.
2012లో అప్పటి ప్రభుత్వం రూ.5.77 కోట్లతో నారింజ ప్రాజెక్టు షటర్లు, కట్ట మరమ్మతులు చేయించింది. 2015లో ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీరందించేందుకు కుడి, ఎడవ కాల్వల మరమ్మతుల పనులు అసంపూర్తిగా వదలివేసింది. మూడేండ్ల క్రితం రూ. 18 లక్షలతో ప్రాజెక్టులో పూడికతీత పనులు నామమాత్రంగానే చేశారు. వివిధ కారణాలతో ప్రాజెక్టును పట్టించుకోకపోవడం, కాల్వల నిర్మాణం తదితర మరమ్మతులు చేపట్టకపోవడంతో ఈ ప్రాంత రైతులకు నారింజ ప్రాజెక్టు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది.
ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టాలని ఇటీవల స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. సంబంధిత అధికారులు ప్రాజెక్టు మరమ్మతుల కోసం రూ.14 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. దీంతో ఆయా మండలాల రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. కానీ, ప్రభుత్వం ప్రాజెక్టు పూడిక తీత, మరమ్మతులు నిధులు మంజూరు చేయలేదు. వేసవికాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమైన ప్రాజెక్టులో పూడిక తీత, మరమ్మతుల ఊసే లేకపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు. కర్ణాటకకు వృథాగా పోతున్న వరద నీటికి అడ్డుకట్ట వేసి, ప్రాజెక్టులో పూడిక తీత పనులు చేపట్టి, కాల్వలకు మరమ్మతు పనులు చేయించి సాగుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.