నారాయణఖేడ్, అక్టోబర్ 20: ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలిచ్చి అధికారం చేపట్టిన తర్వా త మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి పాతరేయాలని నారాయణఖేడ్ మాజీఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. రైతుబంధు ఇవ్వలేమని ప్రకటించిన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివారం నారాయణఖేడ్‌లోని రాజీవ్‌చౌక్ వద్ద మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో రైతుబంధును రైతుభరో సాగా మార్చి ఎకరానికి రూ.7,500 ఇస్తామని ప్రకటించడంతోపాటు వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్, కౌలు రైతులకు రైతు భరోసా, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇసామని ప్రకటించి ఇవ్వకుండా ఇప్పుడు మోసం చేస్తున్నదన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు సైతం సక్రమంగా ఇవ్వుకుండా ఇప్పటికే రెండు దఫాలుగా ఎగబెట్టిందన్నారు. రైతుబం ధు పథకాన్ని శాశ్వతంగా ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదన్నారు. రుణమాఫీ విషయంలోనూ రేవంత్ ప్రభుత్వం రైతులతో చెలగాటం ఆడుతోందని, ఇప్పటి వరకు వందశాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 1.31 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసి ఇక్కడి రైతులకు అన్యా యం చేస్తున్నదన్నారు.
నాగల్గిద్ద, నారాయణఖేడ్, కంగ్టి మండలాల్లో గతంలోని తమ ప్రభుత్వం ఎనిమిది కొత్త చెరువులను మంజూరు చేసి భూసేకరణ సైతం పూర్తి చేయగా, ఆ పనులు సైతం కొనసాగడం లేదన్నారు. హైదరాబాద్‌లో ప్రశాంతంగా నివసిస్తున్న ప్రజలను హైడ్రా పేరిట భయబ్రాంతులకు గురి చేస్తూ, గ్రామాల్లో రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ఏ ఒక్క వర్గానికి సంతృప్తి పర్చలేని దౌర్భాగ్య స్థితిలో రేవంత్‌రెడ్డి పాలన కొనసాగిస్తున్నారన్నారు. అంతకుముందు భూపాల్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి స్థానిక బీఆర్ఎస్ కార్యాలయం నుంచి రాజీవ్‌చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.