రామచంద్రాపురం, జూన్ 29: ఏ వ్యక్తినైనా అమితమైన ప్రేమను పంచగలిగే గొప్ప కవి యరుకల యాదయ్య అని ప్రముఖ కవి నందిని సిధారెడ్డి అన్నారు. యరకల యాదయ్య రచించిన నాలుగో కవితా సంపుటి ‘నీటి అద్దం’ పుస్తకాన్ని ఆదివారం రామచంద్రాపురం పరిధిలోని మల్లికార్జుననగర్ సంక్షేమ భవనంలో సిధారెడ్డి ఆవిషరించి మాట్లాడారు. కవులందరినీ ఒకే స్థాయిలో గౌరవించే వ్యక్తి యాదయ్య అని, కవి అంటే కవిత్వం ద్వారా లోకానికి ప్రేమను అందించాలని, ఆ పని చేయడంలో యాదయ్య ముందున్నారని అభినందించారు.
యాదయ్య స్వచ్ఛమైన కవి అని, నమ్మిన విలువలకు కట్టుబడి నిజాయితీగా, నిబద్ధతతో ఉంటూ దేనికోసం రాజీపడని వ్యక్తిత్వం ఆయనది అని సిధారెడ్డి కొనియాడారు. పుస్తకావిషరణ కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప నగేశ్ యాదవ్, జంట నగరాల అధ్యక్షులు కందుకూరి శ్రీరాములు, తెరసం రాష్ట్ర అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం, బెల్లంకొండ సంపత్ కుమార్, పొట్టబత్తుల యాదగిరి, పాలకుర్ల లింగస్వామి, వంగరి సతీశ్ కుమార్, పాలపాటి రఘురామిరెడ్డి, మన్నె విఠల్, ఉషారాణి, కందాళై రాఘవాచార్య, పలువురు కవులు, కార్మికులు, కాలనీ వాసులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.