జనగామ/చేర్యాల, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘తరిగొప్పుల పక్కనే మా సొంతూరు జిల్లాల పునర్విభజనతో వేరైంది తప్ప నేను పరాయి వాడ్ని కాదు.. పక్కా లోకల్. తెలంగాణ ఉద్యమంలో పోలీసుల దెబ్బలు తిని జైలు జీవితం గడిపిన అసలు సిసలైన ఉద్యమకారుడిని. ఇకపై నా స్థిర నివాసం జనగామే’ అని జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమం, తెలంగాణ సాధన పోరాటం, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి నడిచిన అనుభవాలు, జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఏం చేస్తాననే అంశాలను ఆయన పంచుకున్నారు.
జనగామ జిల్లా కేంద్రంగా స్థిర నివాసం ఉంటా.. కేవలం నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం మాత్రమే ప్రగతి భవన్‌కి వెళ్తా.. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తా.. అర్ధరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. మంచి ఎవ్వరి వద్ద నుంచి అయినా నేర్చుకుంటా.. చిన్నా పెద్ద తేడా అనేది నాకు లేదు. ఇక నుంచి నీలిమ మెడికల్ కాలేజీ దవాఖానలో జనగామ నియోజకవర్గ ప్రజలకు ఎంత ఖర్చయినా ఉచిత వైద్యం అందించే బాధ్యత తనది అని తెలిపారు. 2014లో ఎంపీగా, 2015లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా, 2021లో ఎమ్మెల్సీ గ్య్రాడ్యుయేట్గా ప్రజలకు అనేక సేవలందించా.. ఇక ఎమ్మెల్సీ పరిధిలో 34 నియోజకవర్గాలు ఉంటే ఆయా నియోజకవర్గ ప్రజలు, నాయకులు కూడా నన్ను ఆదరించారు. కాబట్టే ప్రతి జిల్లాకి వెళ్లాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ మాటను తూచ తప్పకుండా పాటించే నమ్మకమైన వ్యక్తిగా నాకు పేరుంది. 2015లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించి 50 లక్షల సభ్యత్వాలు చేయించి మంచిపేరు తెచ్చుకున్నానన్నారు. నా పనితనాన్ని మెచ్చిన పెద్దసార్(కేసీఆర్) అనేక పనులకు ఇన్చార్జిగా నియమించారు. పథకం రైతుబంధు, రైతుబీమా అమలు బాధ్యతలకు సంబంధించి రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి ఇచ్చారన్నారు. కొన్నేళ్ల పాటు పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, మండలి విప్‌గా పనిచేశాను. పార్టీ ప్లీనరీలు, సభ్యత్వ నమోదు, ఎన్నికల ప్రణాళిక, బహిరంగ సభల నిర్వహణతో పాటు ప్రచార బాధ్యతలు చేపట్టి ఉత్తమ పనితనం చూపించినట్లు చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల నిర్వహణ బాధ్యతను కూడా స్వయంగా దగ్గరుండి చూసుకున్న.. వరంగల్ ఎంపీ, పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ, ఖమ్మం కార్పొరేషన్, 2019లో ఖమ్మం ఎంపీ, హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఇన్చార్జిగా పనిచేసి ఆ స్థానాల్లో పార్టీ విజయానికి కృషి చేసినట్లు తెలిపారు. ఎన్నికలు ఎకడ జరిగినా శాయశక్తులా కృషి చేశాను. ఇకడ కూడా అదే వ్యూహం అనుసరిస్తున్న.
ఊరు, వాడ, తండాల్లో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రజల ఆశీస్సులతో నేను గెలవడం పక్కా. నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్‌గా చిన్న, మధ్యతరహా, పెద్ద పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన జరిగేలా చూసే బాధ్యత నాదే అని స్పష్టం చేశారు. పామాయిల్ కంపెనీలు, రైస్ ఇండస్ట్రీ, నిరుద్యోగ నిర్మూలన కోసం ఐటీ హబ్‌ను తెచ్చే ప్రయత్నం చేస్తా.. ప్రభుత్వ నర్సింగ్, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలల నిర్మాణానికి కృషి చేస్తా. జనగామ అనేది కేసీఆర్ మానస పుత్రికగా వచ్చే ఐదేండ్లలో సిద్దిపేటకు ధీటుగా జనగామ రూపురేఖలను మారుస్తా. గ్రామ, మండల, నియోకవర్గ ప్రణాళికలను తయారు చేసుకొని నియోజకవర్గ సమగ్రాభివృద్ధిని బాధ్యతగా తీసుకుంటా. గెలుపుపై పూర్తి ధీమాగా ఉన్నాను. అని బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.
తప్పిపోయి కాంగ్రెస్ చేతికి అధికారం అప్పగిస్తే అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ పాతాళంలోకి జారిపడుతుంది. అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. బీజేపీ గెలువది, కాంగ్రెస్ లేవదు జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలో ఉండగా తాగునీటి కోసం మహిళలు బిందెలతో రోడ్లపైకి వచ్చేవారని గుర్తుచేశారు. పార్టీలకతీతంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులకు కూడా అందజేస్తున్నామని చెప్పారు. కర్ణాటకలో పింఛన్ రూ.600 ఉంటే తెలంగాణలో రూ.2,000 ఉంది. అక్కడ ఎందుకు పింఛన్ ఎక్కువ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ హయాంలో జనగామ ఎట్లుండె.. ఇప్పుడు ఎట్లుందో ఒక్కసారి ఆలోచించండి.. అభివృద్ధి మీ కండ్ల ముందున్నది. ఒకనాడు కరువు విళయ తాండవం చేసిన ఎగువ ప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసిన బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలి. అని కోరారు.