నమస్తే తెలంగాణ నెట్వర్క్ ఉమ్మడి మెదక్ జిల్లా, డిసెంబర్ 28: సమస్య ఏదైనా వెలుగులోకి తేవడం, ఆపై ఆ సమస్య పరిష్కారమే లక్ష్యంగా ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఎల్లవేళలా కృషి చేస్తున్నది.గడిచిన ఏడాది కాలంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజలు ఎదుర్కున్న అనేక సమస్యలను గుర్తించి, కథనాలుగా ప్రచురించి, అటు ప్రభుత్వం.. ఇటు అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి బాధ్యత కలిగిన పత్రికగా తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించింది ‘నమస్తే తెలంగాణ’. పరిశ్రమల ప్రమాదాలు.. కార్మికుల మృత్యువాత.. దక్కని పరిహారం.. బాధితుల రోదనలపై మానవీయ కోణంలో కథనాలు మలిచి బాధితులకు బాసటగా నిలిచింది. పరిశ్రమలు, ప్రాజెక్టులు, రోడ్లు, ఇతరత్రా అభివృద్ధి పనులకు భూములు కోల్పోయి, పరిహారం అందక బాధితులు పడుతున్న గోసను పాలకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవచూపింది. అభివృద్ధి పనుల్లో పురోగతి కరువు.. పల్లెలు, కాలనీల్లో నీటిఎద్దడిపై తాగునీటి గోసగా కథనాలను ప్రచురించింది. ఏరులై పారుతున్న మురుగు సమస్య.. కంపుకొడుతున్న పల్లెలు, మూలకు చేరిన పంచాయతీ ట్రాక్టర్లు.. కళావిహీనంగా మారిన పల్లెప్రకృతి వనాలు.. అంత్యక్రియలకు ఇబ్బందులపై చివరి
మజిలీకి చింత.. ప్రమాదకరంగా మారిన రోడ్లపై మృత్యుదారులుగా.. అభివృద్ధి పనుల ఆలస్యంపై నత్తే నయం అంటూ.. చినుకు పడితే బస్టాండ్ చెరువే అంటూ… మార్కెట్కు మోక్షమెప్పుడో.. ఇలా అనేక సమస్యలపై డిఫరెంట్ శీర్షికలతో సమస్యలను ఫోకస్ చేస్తూ ప్రచురించింది. ప్రజల పక్షాన నిలుస్తూ సమరశంఖం పూరించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపింది. అందులో మచ్చుకు కొన్ని ఇవి…