గుమ్మడిదల, అక్టోబర్ 12: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులోని నల్లకుంట చెరువు కాలుష్య కాసారంగా మారింది. ఇటీవల కురిసిన వానలకు పలు పరిశ్రమలు వదిలిన రసాయన వ్యర్థ జలాలు ఈ చెరువులో చేరి నీరు ఎర్రగా మారి నురగలు కక్కుతున్నది. చెరువు కట్ట పరిసరాల్లో దుర్వాసన వెదజల్లుతున్నది. కాలుష్య జలాలతో సమీపంలోని పంటలు దెబ్బతింటున్నాయి. భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. ఈ చెరువుల నుంచి కాలుష్య జలాలు గొలుసుకట్టు చెరువులకు చేరి అక్కడ కాలుష్యం చేస్తున్నాయి. కాలుష్య జలాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని దోమడుగు రైతులు వేడుకుంటున్నారు.
దోమడుగు నల్లకుంట చెరువు కాలుష్య జలాలతో నిండి అలుగు పారుతున్నది. దీంతో గొలుసుకట్టు చెరువులు దోమడుగు రతనాల చెరువుకు దిగువభాగంలో ఉన్న రాయుడి చెరువు, వావివాల పీయుష చెరువు, జిన్నారం అక్కమ్మచెరువు, ఊట్ల పెద్దచెరువు, సోలకపల్లి పెద్ద చెరువు, పలు కుంటలకు కాలుష్య జలాలు చేరుతున్నాయి. ఈ చెరువుల కింద పంటలు దెబ్బతింటున్నాయి. జిన్నారం మండలంలోని పలు చెరువులకు, కుంటలకు, వాగులకు ఈ కాలుష్య వ్యర్థజలాలతో ముప్పు పొంచి ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేల ఎకరాల్లో రైతుల పంటలు దెబ్బతింటున్నాయి.
ఒక్క దోమడుగు నల్లకుంట చెరువు ద్వారా మిగతా గొలుసుకట్టు చెరువులు, కుంటలు కాలుష్యం బారినపడి నష్టం వాటిల్లుతున్నది. పచ్చని పంట పొలాలతో కళకళలాడిన ఈ ప్రాంతంలో రంగురంగుల కాలుష్య జలాలు కనిపిస్తున్నాయి. కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలకు కోర్టులు సుమోటోగా స్వీకరించాలని పర్యావరణ ప్రేమికులు ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పాలడుగు జ్ఞానేశ్వర్ డిమాండ్ చేశారు. ఇది కాలుష్య విపత్తుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గుమ్మడిదల, జిన్నారం రైతాంగాన్ని ఆదుకోవాలని వారు కోరుతున్నారు. దీనిపై స్పందించిన పర్యావరణ ప్రేమికుడు పాలడుగు జ్ఞానేశ్వర్ సెప్టెంబర్ 23న సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట, 24న దోమడగు నల్లకుంట చెరువు వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, తెలంగాణ జేఏసీ నాయకుడు అశోక్ నల్లకుంట చెరువును పరిశీలించి కాలుష్య జలాలను చూసి చలించిపోయారు.
కాలుష్యజలాలతో కలుషితమైన గొలుసుకట్టు చెరువుల సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలి. కారకులైన వారిపై కోర్టులు సుమోటోగా కేసులు నమోదు చేసి తిరిగి ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలి. కలుషితజలాలతో పంటలు దెబ్బతినడంతో పాటు గడ్డిని తిన్న పశువులకు, వాటి ద్వారా వచ్చే పాల వల్ల కూడా ప్రజలు అనారోగ్యం బారినడుతున్నారు. నల్లకుంట కలుషిత జలాలతో నిండి భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయి. రసాయన పరిశ్రమల్లో జీరోడిశ్చార్జి చేయాల్సిన పరిశ్రమలు వ్యర్థజలాలను వర్షం మాటున వదులుతూ జల కాలుష్యానికి పాల్పడుతున్నాయి. ఇలాంటి పరిశ్రమలపై పీసీబీ అధికారులు కఠినంగా వ్యవహరించాలి. గొలుసు కట్టు చెరువులను పరిరక్షించాలి.
-ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పర్యావరణవేత్త
దోమడుగు నల్లకుంట చెరువు కలుషితం కావడానికి కారణమైన ఒక మేజర్ పరిశ్రమను గుర్తించాం. శాంపిల్స్ సేకరించి స్టేట్ పీసీబీ బ్రాంచ్ అధికారులకు నివేదించాం. ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్టేట్ పీసీబీ బ్రాంచ్ అధికారుల సూచనల మేరకు నడుచుకుంటాం. రైతులు నష్టపోవడం, నేల,నీరు,వాయు కలుషితానికి కారకులైన వారిపై చర్యలు తప్పవు.
– పాఠక్, పీసీబీ ఈఈ