సిద్దిపేట టౌన్, డిసెంబర్ 18: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను న్యాక్ పీర్ టీం సోమవారం సందర్శించింది. మొదటిరోజులో భాగంగా న్యాక్ టీం చైర్ పర్సన్ బ్రజ్ భూషణ్ ఓజా, న్యాక్ టీం సభ్యుల బృందం ప్రొఫెసర్ హోషియార్ దిమి, కో-ఆర్డినేటర్ అయ్యాపిళ్లై సెల్వకుమార్తోపాటు తెలంగాణ సీసీఈ నామిని ఉన్నత విద్యాశాఖ సంయుక్త సంచాలకుడు ప్రొఫెసర్ రాజేందర్ సింగ్ ఈ సందర్శనలో ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బృంద సభ్యులు కళాశాలలోని ప్రిన్సిపాల్ చాంబర్లో ప్రగతిని పీపీటీ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం కళాశాల కో-ఆర్డినేటర్ మధుసూదన్, కళాశాలలో నాణ్యమైన విద్యను బోధించుటకు తీసుకున్న చర్యలను బృందానికి చూపించారు. అంతకుముందు ముగ్గురు అధికారులు వేర్వేరుగా కళాశాలలోని 18 విభాగాలను సందర్శించి అవసరమైన సూచనలు చేశారు. పర్యావరణానికి సంబంధించి స్టాళ్లను, సైన్స్ ల్యాబ్‌లను సందర్శించి, సూచనలు చేశారు. అనంతరం కళాశాలలో పూర్వ విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి, ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. కళాశాలలో అందుతున్న విద్య, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ఆరా తీశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. మంగళవారం ఈ బృందం కళాశాలను సందర్శించనున్నది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, గోపాల సుదర్శనం తదితరులున్నారు.
సంపాదనతోపాటు చదువుకోవాలనే ఉద్దేశంతో నైపుణ్య రంగాలను ప్రోత్సహిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా డిగ్రీ కోర్సులను ఆధునీకరిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలంగాణ ఉన్నత విద్యశాఖ సంయుక్త సంచాలకుడు ప్రొఫెసర్ రాజేంద్రసింగ్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న డిగ్రీ కళాశాల పరిస్థితులు వివరిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం 145 డిగ్రీ కళాశాలలు ఉన్నాయని, వీటిలో 54 వేర్వేరు సబ్జెక్ట్ కాంబినేషన్లతో విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. మెట్రో పాలిటిన్ నగరంలాంటి హైదరాబాద్‌తో పాటు వివిధ కళాశాలల్లో ఉపాధి కోర్సులను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. చదువుతోపాటు విద్యార్ధులకు నెలకు 7 నుంచి 11వేల వేతనం వరకు సంపాదిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏడు మోడల్ కళాశాలలు, 15 స్వయం ప్రతి పత్తి కళాశాలలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 94 కళాశాలలకు న్యాక్ అక్రిడేషన్ పొందాయని ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేస్తూ గ్రామీణ విద్యార్థులకు ప్రైవేటు కళాశాలలకు దీటుగా ఉన్నత విద్యామండలి విద్యనందిస్తుందన్నారు. ప్రతి కళాశాలలో ప్లేస్మెంట్ ఏర్పాటు చేసి ఆన్లైన్ విద్యనందిస్తూ జూమ్ గూగుల్ తరగతులను బోధించడం జరుగుతుందన్నారు. బోధన సిబ్బందిని బోధనతోపాటు పరిశోధన వైపు ప్రోత్సహించాలనే సంకల్పంతో ప్రభుత్వం 5 వేల నగదు సాయంతో ప్రోత్సాహకాలను అందిస్తుందన్నారు. కళాశాలలో స్పోకెన్ ఇంగ్లీష్‌ను ప్రోత్సహించాలని ప్రతి కళాశాలలో ఇంగ్లిష్ క్లబ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్తుతున్నామన్నారు.