హుస్నాబాద్, అక్టోబర్ 27: హుస్నాబాద్‌లోని మినీస్టేడియంలో తాత్కాలికంగా నడుస్తున్న ఎంవీఐ యూ నిట్ కార్యాలయానికి శాశ్వత భవన నిర్మాణంతో పాటు ట్రాక్, పార్కింగ్ తదితర అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. హుస్నాబాద్ పట్టణానికి సుమారు 3కిలోమీటర్ల దూరంలో ఎంవీఐ కార్యాలయానికి స్థలం కేటాయించడం, అందులో ఎల్లమ్మ చెరువును ఆనుకొని స్థలం ఉండటంతో భవిష్యత్‌లో భారీ వర్షాలు పడితే కార్యాలయం నీటమునిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హుస్నాబాద్‌లోని ఎంవీఐ కార్యాలయానికి నిత్యం వాహనాలతో పాటు వాహనదారులు, వివిధ లైసెన్స్‌ల కోసం ప్రజలు వస్తుంటారు. ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు కార్యాలయం నిర్వహణకు కావాల్సిన స్థలాన్ని కేటాయించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువును ఆనుకొని సర్వే నంబర్ 265/1లో స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలాన్ని చదును చేయించారు. చదును చేసిన స్థలం కనీసం అర ఎకరం కూడా ఉండదని, ఇందులో ఎంవీఐ కార్యాలయం ఎలా నిర్మిస్తారని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. హుస్నాబాద్-రామవరం రోడ్డు డబుల్‌రోడ్డుగా నిర్మాణమైతే అక్కడ స్థలం మిగిలే అవకాశమే ఉండదని పట్టణ ప్రముఖులు అంటున్నారు.
ఎంవీఐ కార్యాలయానికి కనీసం 3నుంచి 5ఎకరాల స్థలం అవసరమవుతుంది. వాహనాల ట్రయల్న్,్ర డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చేవారికి డ్రైవింగ్పరీక్షలు నిర్వహించేందుకు కనీసం ఎకరం స్థలం కావాల్సి ఉంటుంది. మరో ఎకరానికి పైగా స్థలం పార్కింగ్ కోసం, మిగతా స్థలంలో కార్యాలయ నిర్మాణం జరగాల్సి ఉండగా నామమాత్రంగా స్థల కేటాయింపులు చేసి ప్రజలకు అందుబాటులో కార్యాలయం లేకుండా చేయడంపై ఆగ్రహం వ్యక్తవమవుతోంది. కేవలం రెండు ఎకరాల స్థలం కేటాయించి అధికారులు చేతు లు దులుపుకొన్నారు.
మినీ స్టేడియం పక్కనే సుమారు 4ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ అందులో కాకుండా ఊరికి 3కిలోమీటర్ల దూరంలో ఎంవీఐ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు చేయడంలో అంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నిర్మించిన కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నందున ఈ కార్యాలయమైనా అందుబాటులో నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై ఎంవీఐ కొండల్‌రావును వివరణ కోరగా జిల్లా కలెక్టర్ రెండు ఎకరాల స్థలం కేటాయించారని, అధికారుల ఆదేశాలమేరకు స్థలాన్ని చదును చేశామన్నారు. ఊరికి దూరంగా ఏంవీఐకి స్థలం కేటాయింపు విషయం మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి వెళ్లిందా లేదా అనే విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఎంవీఐ కార్యాలయానికి నిత్యం వాహనాలు, వాహనదారులు వస్తుంటారు. ఇది ప్రజలకు అందుబాటులో నిర్మించాలి. ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తే ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడతారు. రెండు ఎకరాల స్థలం కేటాయించడం, చెరువు పక్కన కేటాయించడం ఏమాత్రం అనువైంది కాదు. కనీసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలి. ప్రస్తుతం నడుస్తున్న కార్యాలయం పక్కనే ఉన్న స్థలంలో ఏర్పాటు చేస్తే అందరికీ బాగుంటుంది. మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా అధికారులు దీనిపై పునరాలోచించాలి.
-పచ్చిమట్ల రవీందర్‌గౌడ్, బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి -హుస్నాబాద్