మెదక్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : నాలుగు రోజుల్లో సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ప్రాజెక్టుకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి సోమవారం బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు ఫిర్యాదు చేశారు.
అనంతరం మెదక్ కలెక్టరేట్ ఆవరణలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకంట కన్నీళ్లు పెట్టిస్తున్నదన్నారు. సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని, లేదంటే మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల రైతులతో పెద్ద ఎత్తున మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.
మెదక్ ఎమ్మెల్యే చీటికి,మాటికి సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లా అంటారే తప్ప ఇకడి రైతుల పరిస్థితి పట్టించుకున్న పాపాన పోవడం లేదని విమర్శించారు. సింగూరులో నీళ్లు ఉన్నప్పటికీ ఘనపూర్ ప్రాజెక్టుకు 0.4 టీఎంసీలు రావాల్సిన నీటిని విడుదల చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సమయానికి నీళ్లు విడుదల చేశారని గుర్తు చేశారు. గత పదేండ్లలో రైతులు ఏనాడూ రోడ్డెకిన పరిస్థితి లేదన్నారు. సింగూరు, కాళేశ్వరం జలాలు, కొండపోచమ్మసాగర్ నుంచి హల్దీప్రాజెక్టుకు సాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నర్సాపూర్ , దుబ్బాక నియోజకవర్గాల్లోని నార్సింగ్, చేగుంట, గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మండలాల్లో అధికార పార్టీ నాయకులు, అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని కలెక్టర్‌కు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేకు ఎసార్ట్ ఇవ్వకుండా అధికార పార్టీ నేతలకు పోలీసులు ఎసార్ట్ ఇస్తున్నారని మండిపడ్డారు.
ప్రొటోకాల్ విషయంలో సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్‌ను కోరారు. మాజీ మున్సిపల్ చైర్మన్లు ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి, జడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు లావణ్యారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, కో కన్వీనర్ గడ్డమీది కృష్ణా గౌడ్, లింగారెడ్డి జుబేర్, న్యాయవాది జీవన్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ గంగ నరేందర్, మాజీ కౌన్సిలర్లు జయరాజ్, ఆర్కే శ్రీనివాస్, మాయ మల్లేశం, ఏడుపాయల మాజీ చైర్మన్ బాలాగౌడ్, మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.