సిద్దిపేట, అక్టోబర్ 24: సిద్దిపేటలో గురువారం రాష్ట్రంలోని 11మున్సిపాలిటీలకు సంబంధించిన కమిషనర్లు, అధికారులు పర్యటించారు. ముందుగా పట్టణంలో తడి, పొడి చెత్త వేరుచేయు విధానాన్ని పరిశీలించారు. చెత్తను తరలించే బుస్సాపూర్ రిసోర్స్ పార్క్‌ను సందర్శించి చెత్త ద్వారా తయారు చేసే బయో సీఎన్జీ గ్యాస్ ప్లాంట్, బయో మైనింగ్, ఎఫ్ఎస్టీపీలను పరిశీలించారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేట ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఇర్కోడ్ వద్ద రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన స్లాటర్ హౌజ్‌ను, డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్ ను, సిద్దిపేటలోని స్వచ్ఛబడిని సందర్శించారు.
మున్సిపల్ కమిషనర్లు, అధికారులకు సిద్దిపేటలో జరిగిన అభివృద్ధిని ప్రొజెక్టర్ ద్వారా మున్సిపల్ చైర్పర్సన్ మంజుల వివరించారు. రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీలకు సిద్దిపేట ఆదర్శంగా నిలిచేందుకు హరీశ్‌రావు కృషి, పట్టుదల ఎంతో ఉందన్నారు. సిద్దిపేట ప్రజలు ఎంతో గర్వంగా చెప్పుకునేలా అభివృద్ధి చేసిన నాయకుడు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో ప్రారంభించిన స్టీల్ బ్యాంక్ వ్యవస్థ నేడు దేశానికే ఆదర్శంగా మారిందన్నారు.
మున్సిపల్ కమిషనర్లు మాట్లాడుతూ..ప్రతి మున్సిపల్ కమిషనర్‌కు సిద్దిపేటలో విధులు నిర్వహించాలనే కోరిక ఉంటుందని, అంతగా అభివృద్ధి చెందిందన్నారు. సిద్దిపేట స్వచ్ఛబడి ఒక నిఘంటువు అని, ఎన్నో వినూత్న ఆలోచనలకు వేదికగా నిలిచిందన్నారు. పట్టణంలో చెత్తను మూడు రకాలుగా వేరు చేసి మున్సిపాలిటీకి ఆదాయాన్ని సమకూర్చడం గొప్ప విషయమన్నారు. అనంతరం కోమటిచెరువు, రూబీ నెక్లెస్ రోడ్‌ను వారు సందర్శించారు. వారివెంట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్‌కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, అధికారులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.