సిద్దిపేట, ఏప్రిల్ 7 : నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ మంజూరైంది. వైద్య విద్యార్థులు పాఠాలకే పరిమితం కాకుండా, పరిశోధనలపై ఆసక్తి పెంపు చేయడమే దీని లక్ష్యం. మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ మంజూరు చేయించడంపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. తొలి విడతగా రూ.2.5కోట్లు కేటాయించినట్లు, ప్రభుత్వ వైద్య కళాశాలలో పరిశోధనలకు ఊతమిచ్చేలా దోహదపడనున్నది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 35 విభాగాలు ఉంటాయి. వాటిలో పరిశోధన చేయాలంటే ఈ రీసెర్చ్ యూనిట్ ఉపయోగించుకుంటారు. ఇందులో పరిశోధనలకు అవసరమైన అన్నీ రకాల అధునాతన యంత్ర పరికరాలు ఉంటాయి. మెడికల్ కళాశాలలో చేసిన పరిశోధన ఫలితాలను పబ్లికేషన్‌కు పంపుతారు. వాటిల్లో ప్రచురితమైతే అటు పరిశోధన చేసిన విద్యార్థికి ఇటు వైద్య కళాశాలకు పేరు వస్తున్నదని వైద్య ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి.
మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ ముఖ్య ఉద్దేశం
వ్యాపార నిబంధనలను అనుసరించి వైద్య సంబంధమైన ప్రయోగాలు చేయడం. మెడికల్ కళాశాల పరిశోధనా కేంద్రంతో కలిసి బహుళ కేం ద్ర పరిశోధనలు జరపడం. మెడికల్ కళాశాలలో పరిశోధన వాతావరణాన్ని పెంపొందించడం, పరిశోధనలను ప్రోత్సహించడం. పరిశోధనకు నిరోధకంగా మారిన మౌలిక సదుపాయాలు సమకూర్చడం. రుజువులతో కూడిన వైద్య సేవలను ప్రజలకు అందించడం. వైద్యరంగంలో పరిశోధన కార్యక్రమాల్లో మానవ వనరుల ప్రాధాన్యతను పెంచడం.
ఎంఆర్‌యూ విధులు
మెడికల్ కళాశాలలో నాణ్యమైన పరిశోధనలు ప్రోత్సహించడం, ప్రచారం కల్పించ డం. స్థానిక పరిశోధన సలహా మండలిని ఏర్పాటు చేసి రాష్ట్ర వైద్య వ్యవస్థ అధికారుల సహకారంతో పరిశోధన ప్రాధాన్యత అం శాలు, ప్రాజెక్టులను గుర్తించడం. లోకల్ అడ్వజరీ కమిటీ సూచించిన సంక్రమించని వ్యాధులను, అవసరమైన ఇతర వ్యాధుల గురిం చి పరిశోధనలు చేయడం. పరిశోధనలు నిర్వహించడానికి ఐదేండ్లకు ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేస్తున్నది. ఈ నిధులను సివిల్ నిర్మాణాలు, పరికరాల కొనుగోలు, జీతాలు, శిక్షణ కార్యక్రమం నిర్వహణకు వినియోగిస్తారు. సివిల్ నిర్మాణాలకు రూ.25లక్షలు, పరికరాల కొనుగోలుకు రూ. 2కోట్లు ప్రభుత్వం కేటాయించింది.