సిద్దిపేట అర్బన్, జనవరి 25: ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో జరిగే ‘లక్ష డప్పులు, వేల గొంతుకలు’ సన్నాహక సమావేశాన్ని సిద్దిపేటలోని వయోలా గార్డెన్లో శనివారం నిర్వహించగా, ఈ సమావేశానికి మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు సిద్దిపేటలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి అక్కడి నుంచి వయోలా గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. మాదిగల ఆకాంక్షను ప్రపంచానికి చూపెట్టేందుకు ఫిబ్రవరి 7న మహత్తర సాంస్కృతిక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు.
జాతి బిడ్డల భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. నాడు సమైక్యాంధ్ర వాదులు, లగడపాటి చేసిన పనే నేడు మాలలు చేస్తున్నారని పేర్కొన్నారు. నాడు లగడపాటి పోషించిన పాత్రే నేడు వెంకటస్వామి కుటుంబం పోషిస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం అనేక పార్టీలతో లేఖలు రాయి స్తే.. వర్గీకరణ కోసం తాను కూడా లేఖలు రాయించానన్నారు. గతంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పువస్తే 24 గంటల్లోపే అమలు చేసిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు సుప్రీంకోర్టు వర్గీకరణ అమలు తీర్పు ఇచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీలో ప్రస్తావించిన సీఎం రేవంత్‌రెడ్డి ఎందు కు వర్గీకరణను అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల నాయకులకు రేవంత్‌రెడ్డి తలొగ్గారన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మాలలను ప్రోత్సహిస్తున్నదన్నారు. మాల సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకులు సభ లు పెట్టి వర్గీకరణను అడ్డుకుంటామని తొడ లు కొట్టి, మీసాలు తిప్పుతున్నారని.. కానీ, తాము మాత్రం శాంతియుతంగానే ఉద్యమం చేస్తామన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పెర్క పరశురాములు, యాదగిరి, శ్రీనివాస్, కృష్ణ, జువ్వన్న కనకరాజు, ప్రసాద్, శంకర్, ఇస్తారి, రమేశ్ పాల్గొన్నారు.