అందోల్, జూన్ 24: వట్టి నాగులపల్లి- సంగారెడ్డి, జోగిపేట, మెదక్ రైల్వేలైన్‌తోపాటు వట్టి నాగులపల్లి- సంగారెడ్డి, జోగిపేట, నారాయణఖేడ్ మీదుగా రైల్వేలైన్ ఏర్పాటుపై కదలిక ప్రారంభమైందని రైల్వే లైన్ సాధన సమితి కన్వీనర్ గంగా జోగినాథ్ గుప్తా తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైల్వేలైన్ కోసం దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీధర్‌తోపాటు మెదక్ ఎంపీ రఘునందన్‌రావును కలిశామన్నారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. 15 సంవత్సరాలుగా రైల్వేలైన్ కోసం సంబంధిత శాఖ మంత్రులు, అధికారులను కలుస్తున్నామని, ఇన్నాళ్లకు చేసిన కృషి ఫలించబోతుందన్నారు. గతంలో ఒకసారి ఈ రైల్వేలైన్ కోసం సర్వే పూర్తి చేశారని, ఇప్పుడూ మరోసారి సర్వే చేయనున్నట్లు అధికారులు తెలిపారన్నారు. ఈ సందర్భంగా ఎంపీతోపాటు సంబంధిత అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.