దుబ్బాక, జూన్ 15: కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థ రాజకీయం కోసం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందించే నోటు పుస్తకాలను సైతం వదలడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. శనివారం సాయంత్రం దుబ్బాక మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలను ఎమ్మెల్యే సందర్శించారు. ఆ సమయంలో గురుకులం నుంచి డీసీఎంలో నోటు పుస్తకాలను తరలిస్తున్నారు. ఆ నోటు పుస్తకాలపై కేసీఆర్ చిత్రపటం ఉండటమే కారణమని, అధికారుల సూచనల మేరకు ఆ నోటు పుస్తకాలను సంగారెడ్డి జిల్లా కందికి తరలిస్తున్నట్లు గురుకుల సిబ్బంది వివరించారు.
పాఠ్య పుస్తకాలే కాకుండానోటు పుస్తకాలను వదలకపోవడంపై ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఆసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలపై కేసీఆర్ చిత్రపటం తొలిగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పాఠ్య పుస్తకాలపై మాజీ సీఎం జగన్ చిత్రపటాన్ని అక్కడి ప్రభుత్వం తొలిగించలేదని గుర్తు చేశారు. నోటు పుస్తకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుడు రాజకీయం చేస్తున్నదని విమర్శించారు. విద్యా సంవత్సరం ఆరంభంలో విద్యార్థులను, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. గురుకులంలో విద్యార్థులకు అందజేయాల్సిన పాఠ్య, నోటు పుస్తకాలు సకాలంలో అందించకపోవడంతో విద్యాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయన్నారు.