శివ్వంపేట, మే 16: విద్యుత్‌షాక్‌తో తల్లీకొడుకు మృతి చెందిన ఘటన గురువారం శివ్వంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై మహిపాల్‌రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. మం డలంలోని ఉసిరికపల్లి గ్రామానికి చెందిన నీరుడి మణెమ్మ(45) గురువారం ఉదయం 6.30గంటల ప్రాంతంలో బట్టలు ఉతికి ఇంటి ఎదుట ఉన్న దండేనికి (జే వైర్)పై ఆరేస్తుండగా, రాత్రి కురిసిన వర్షానికి జే వైర్‌కు ఇంటి సర్వీస్ వైర్ తగిలి విద్యుత్ షాక్‌కు గురైంది.
గమనించిన మణెమ్మ మరిది కుమారుడు నీరుడి భానుప్రసాద్(19) ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా అతడికి కూడా షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. అంతలోనే మణెమ్మ కూతురు శ్రీలత వచ్చి చూసే సరికి వారు కిందపడి ఉన్నారు. వారిని చూసి లేపే ప్రయత్నం చేయగా ఆమె కరెంట్ షాక్‌కు గురైంది. వెంటనే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేయడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వారిని తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. అప్పటికే మణెమ్మ, భానుప్రసాద్ మృతి చెందారు. శ్రీలత స్వల్ప గాయాలతో బయటపడింది. మృతుడు భానుప్రసాద్ తండ్రి లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై మహిపాల్‌రెడ్డి తెలిపారు.
ఉసిరికపల్లిలో జరిగిన అంత్యక్రియలకు ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి హాజరై మృతుల కుటుంబసభ్యులను పరార్శించారు. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు, మండల నాయకులు పరార్శించారు. మృతుడు భానుప్రసాద్ బీఆర్ఎస్లో చురుగ్గా పనిచేశారని గుర్తుచేశారు. ఎమ్మె ల్యేతోపాటు స్థానిక నాయకులు రూ.25 వేలు, జడ్పీటీసీ పబ్బ మహేశ్‌గుప్తా రూ.10వేలు, ఎం పీపీ కల్లూరి హరికృష్ణ రూ.8వేలు ఆర్థికసాయం అందజేశారు. ఎమ్మెల్యే వెంట బాబూరావు, రమణాగౌడ్, సిలువేరి వీరేశం, తూము కృష్ణారావు, శ్రీనివాస్‌గౌడ్, ఆంజనేయులు ఉన్నారు.