గుమ్మడిదల, నవంబర్ 14: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పంచాయతీ పరిధిలోని వీరభద్రనగర్ కాలనీ గురువారం ఉలిక్కిపడింది. ఈ కాలనీకి చెందిన సరోజాదేవి (50), అనిల్(30) పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్యకు గురికావడంతో కాలనీవాసులు భయాందోళన చెందారు. తమ కుమారుడి మరణానికి సరోజాదేవి కుటుంబం కారణమని నాగరాజు అనే వ్యక్తి ఈ హత్యలకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం 10.30 గంటలకు సరోజాదేవి, ఆమె కుమారుడు అనిల్ బైక్ మీద వెళ్తుండగా నాగరాజు తన కారులో వెళ్లి వారి బైక్‌ను అడ్డగించి కత్తితో విచక్షణారహితంగా అనిల్ చాతిలో పొడిచాడు. తల్లి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెను కూడా కత్తితో వెనుకభాగంలో పొడిచాడు.
బలమైన గాయాలు కావడంతో తల్లీకొడుకు ఘటనా స్థలంలోనే రక్తమడుగులో ప్రాణాలు వదిలారు. తన కొడుకును చంపినందునే తల్ల్లీకొడుకును చంపానని ఆగ్రహంతో నాగరాజు అరిచాడు. సమీపంలోనే పోలీస్‌స్టేషన్ ఉండడంతో హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హత్య చేసిన నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటన స్థలానికి సీఐ సుధీర్‌కుమార్,గుమ్మడిదల, జిన్నారం ఎస్సైలు మహేశ్వర్‌రెడ్డి,నాగలక్ష్మి తన సిబ్బందితో చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలు సరోజాదేవి సోదరి జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను నర్సాపూర్ సర్కారు దవాఖానకు తరలించారు. నిందితుడు నాగరాజును కష్టడిలో తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.సీఐ సుధీర్‌కుమార్, ఎస్సై మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాలనీలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.