జహీరాబాద్, జూన్ 17: ఈసారి తొలకరి ముందుగానే ప్రారంభమైనట్లు వాతావరణంలో మార్పులు కనిపించినప్పటికీ రైతులకు నిరాశే ఎదురైంది. వర్షాకాలం ప్రారంభం కంటే ముందే మేలో వర్షాలు కురవడంతో పాటు వర్షాకాలం ప్రారంభ దశలో వర్షం కురిసి మురిపించింది. ఆ తర్వాత ఆకాశంలో మార్పులు సంభవిస్తున్నా.. మేఘాలు కమ్ముకున్నా.. వర్షం కురిపించడంలో వరుణ దేవుడు దోబూచూలాడుతూనే ఉన్నాయి. మృగశిర కార్తె వెళ్లిపోయింది.
ఇప్పటికే చెలుక భూముల్లో విత్తనాలు నాటడం పూర్తికావాల్సింది. కానీ, మేఘా లు ముఖం చాటేయడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. అక్కడక్కడా చిరుజల్లులు, మోస్త్తరు వర్షం కురుస్తున్నా.. విత్తనాలు విత్తుకునేందుకు వీలు లేకుండా పోతున్నదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే భూముల్లో విత్తుకున్న పత్తి, సోయాబీన్, జీలుగ, జనుము తదితర విత్తనాలు సగానికి పైగా మొలకెత్తక పోవడతంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నప్పటికీ వర్షాలు కురవడం లేదు. దీంతో వరుణదేవుడి కరుణ కోసం రైతులు ఆకాశం వైపు ఆశతో ఎదురు చూస్తున్నారు. సకాలంలో వర్షాలు కురిసే ఈ పాటికి విత్తనాలు విత్తడం పూర్తయ్యేదని చెబుతున్నారు. కొందరు రైతులు ఇప్పటికే విత్తనాలు విత్తారు. వర్షం కురిస్తే విత్తనం మొలకెత్తే అవకాశం ఉంటుంది.
రైతులను అన్నివిధాలుగా అదుకుంటామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కాలం కాలిసి రావడం లేదు. ఒకవైపు వర్షాలు కురవకపోవడం.. మరోవైపు ఎండల తీవ్రత ఎక్కవకావడంతో భూముల్లో సాగుచేసిన పత్తి తదితర విత్తనాలు మొలకెత్తక చాలాచోట్ల రైతులు మొక్కలకు నీరు అందించేందుకు డ్రిప్, స్ప్రింక్లర్లను ఏర్పా టు చేసే పనిలో నిమగ్నమయ్యారు.