నాగల్గిద్ద, జూన్ 14: సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని మొర్గి వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు రెండేండ్లుగా పూర్తికావడం లేదు. పనులు పిల్లర్ల దశలోనే ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగుపై బ్రిడ్జి లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానిక ప్రజాప్రతినిధులు ఆనాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కరస్‌గుత్తి ప్రధాన రహదారి నుంచి షాపూర్ వరకు 5 కిలోమీటర్ల డబుల్‌లైన్ రోడ్డు నిర్మాణానికి రూ.5.54 కోట్లు మంజూరు చేయించారు. దీంతో పాటు మొర్గి సమీపంలో వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.6.32 కోట్ల నిధులు మంజూరు చేయించారు. రోడ్డు నిర్మాణం పూర్తికాగా, నిబంధనల ప్రకారం ఆరునెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. కానీ, రెండేండ్లు పూర్తవుతున్నా నేటికి బ్రిడ్జి పూర్తికాక ప్రయాణానికి ఇబ్బందులు తప్పడం లేదు.
నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి కర్ణాటకలోని బీదర్ జిల్లాకు రాకపోకలు కొనసాగించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పీఎంజీఎస్‌వై నిధులు రూ.6.32 కోట్లు మంజూరు చేసింది. బ్రిడ్జి పనులకు 2022 మార్చి 6న శంకుస్థాపన చేశారు. పనులు ఎందుకు ఆగిపోయాయో తెలియడం లేదు. ప్రస్తుతం పిల్లర్ల దశలోనే పనులు ఆగిపోయాయి. అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా నిర్మాణ పనులు చేపట్టి తీవ్రజాప్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ బ్రిడ్జి పూర్తయితే నారాయణఖేడ్ ప్రాంత ప్రజలకు కర్ణాటకలోని బీదర్‌కు వెళ్లే దూరం తగ్గడంతో పాటు ఈ ప్రాంత ప్రజలకు రవాణా కష్టాలు తీరుతాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు స్పందించి బ్రిడ్జి పనులు పూర్తయ్యేలా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
రెండేండ్లుగా వంతెన పనులు పూర్తికాక రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పనులు మధ్యలో నిలిచిపోవడంతో మొర్గిలో మోడల్ పాఠశాల, కళాశాల ఉండడంతో పాటు కర్ణాటకలోని బీదర్ జిల్లాకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది.ఈ మార్గంలో రోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగుతుంటాయి. పెద్దసార్లు పట్టించుకొని తొందరగా వంతెన నిర్మాణం పూర్తిచేస్తే సౌకర్యంగా ఉంటుంది.