హుస్నాబాద్, జూలై 10: బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఎల్ఏలు సర్‌పై అప్రమత్తంగా ఉండాలని, అలాగే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేసేందుకు బీఆర్ఎస్ బీఎల్ఏలు, కార్యకర్తలు నాయకులు ముందుండి పనిచేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ పిలుపునిచ్చారు.
శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఓటరు పరిశీలన కార్యక్రమంపై జరిగిన అవగాహన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలపై గ్రామాల్లో విస్తృతంగా చర్చించాలన్నారు. ‘సర్’ ప్రక్రియలో ఓట్లు పోకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఓటర్లకు సహకరిస్తూ ఓటరు నమోదుపై గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అర్హుల ఓట్లు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
బీఎల్ఏలు చురుగ్గా పాల్గొనాలని, ఇంటింటికీ వెళ్లినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్లకు వివరించాలని పిలుపునిచ్చారు. సర్‌కు సంబంధించి ఏ సమస్య ఉన్నా బీఎల్వో, ఏఆర్వో, ఆర్వోలకు ఫిర్యాదు చేయాలన్నారు. రెండుచోట్ల ఓట్లు ఉండటం సరికాదన్నారు. ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు విధిగా రసీదు తీసుకోవాలని, ఆన్లైన్ పూర్తయ్యాక వచ్చే మెసేజ్‌ను సేవ్ చేసి పెట్టుకోవాలని సూచించారు. దేశ పౌరులుగా ఓటు కలిగి ఉండటం హక్కు అన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, బీఎల్ఏలు పాల్గొన్నారు.