సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 18: ఎన్నికల సిబ్బంది అ్రప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు మహేశ్ దత్ ఎక్కా స్పష్టం చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోడల్ అధికారులు, ఏఆర్వో అధికారులతో ఎన్నికల విధులపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రత్యేకత ఉంటుందన్నారు.
ఎన్నికల విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులను గుర్తించి షోకాజ్ నోటీసులు అందజేసి సస్పెండ్ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. మొదటి, రెండో ర్యాండమైజేషన్ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతకుముందు సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాలలోని పోలింగ్ కేంద్రం, అంబేద్కర్ మైదానంలోని డీఆర్సీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, అదనపు ఎస్పీ సంజీవరావు, ట్రైనీ కలెక్టర్ మనోజ్ కుమార్, నోడల్ అధికారులు, ఆర్వోలు, తహసీల్దార్లు తదిత రులు పాల్గొన్నారు.