సిద్దిపేట అర్బన్, నవంబర్ 29: తెలంగాణ మలిదశ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీలో అనేక మంది చేరారని, వారిలో కొందరు పార్టీకి ద్రోహం చేసి బయటకు వెళ్లారని, ఇప్పుడు పాళ్లేవో.. నీళ్లేదో తెలిసిందని, పార్టీని వీడిన దొంగలను మళ్లీ గులాబీ పార్టీ గుమ్మం కూడా తొక్కనీయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన దీక్షాదివాస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దీక్షాదివాస్ కార్యక్రమం చూస్తుంటే ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయన్నారు. కేసీఆర్ పదవుల గురించి ఆలోచించి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదన్నారు. సిద్దిపేటలో జరిగిన ఉద్యోగ గర్జన సభ సన్నాహక సమావేశంలో అవసరమైతే తెలంగాణ కోసం ఆమరణ దీక్షకు దిగుతానని కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తు చేశారు.
అక్టోబర్ 21, 2009న సిద్దిపేటలో టీఎన్జీవో అధ్యక్షుడు స్వామిగౌడ్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవీప్రసాద్ ఆధ్వర్యంలో లక్షలాది మంది ఉద్యోగులతో అద్భుతమైన ఉద్యోగ గర్జన సభ నిర్వహించుకున్నట్లు గుర్తుచేశారు. తదనంతరం కేసీఆర్ సిద్దిపేట వేదికగా నవంబర్ 29న ఆమరణ దీక్షకు పూనుకున్నాడని.. ఆ క్రమంలో అల్గునూరు వద్ద కేసీఆర్‌ను అదుపులోకి తీసుకొని ఖమ్మం జైలుకు తరలించారన్నారు. కేసీఆర్‌ను ఖమ్మంకు తరలిస్తే ఉద్యమం చల్లారుతుందని నాటి ముఖ్యమంత్రి రోశయ్య అనుకున్నారని.. కానీ ఖమ్మం జైలు వద్దకు పెద్ద ఎత్తున ఉద్యోగులు, లాయర్లు, విద్యార్థులు, నాయకులు వచ్చారన్నారు. ఖమ్మం జైలులో కేసీఆర్‌తో పాటు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, నాయిని నరసింహారెడ్డి, రాజయ్య లాంటి వాళ్లను కూడా అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారన్నారు.
అపుడు తాము రంగధాంపల్లిలో తాము దీక్షకు పూనుకున్నామని.. కానీ, తమను అరెస్ట్ చేసి వివిధ జైళ్లకు తరలించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. నాడు గ్రామాల నుంచి ప్రజలను బయటకు రానియ్యని పరిస్థితి అన్నారు. సిద్దిపేటలో ఎటు చూసినా పోలీసోల్లే ఉన్నారని.. అయినా కొన్ని వేల మంది దీక్షాస్థలికి వచ్చారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా పోరాటం కొనసాగించామన్నారు. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద దీక్షా శిబిరాన్ని ప్రారంభించి 1531 రోజులు దీక్ష కొనసాగించినట్లు తెలిపారు. జూన్ 2, 2014న గెజిట్ నోటిఫికేషన్ వచ్చే వరకు దీక్షా శిబిరాన్ని నడిపించామన్నారు.
ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. నాలుగు సంవత్సరాలకు పైగా దీక్షా శిబిరాన్ని నడిపించామన్నారు. కొన్ని వందల మంది దీక్షా స్థలిని నడిపించారని.. ఎంతో మంది మహిళలు దీక్షలో పాల్గొన్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం ఎంతో గొప్ప చరిత్ర కలిగిందని, ఎంతోమంది విద్యార్థుల త్యాగాలు, కేసీఆర్ ఆధ్వర్యంలో శాంతియుత పోరాటంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్, బీఆర్ఎస్కు ఉన్నంత ప్రేమ ఏ పార్టీకి ఉండదని.. చావు నోట్లో తలపెట్టి, కొట్లాడి తెలంగాణ తెచ్చామన్నారు.
కేసీఆర్ దీక్షా దివస్ స్ఫూర్తితో.. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేదాక అందరం ఒక్కటై కొట్లాడుదామని సంకల్పం తీసుకుందామని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. లగచర్లలో కొట్లాడింది బీఆర్ఎస్ అని.. హైడ్రాలో కొట్లాడింది బీఆర్ఎస్ అని.. ఇదే విధంగా రైతుల పక్షాన, మహిళలు, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతోందన్నారు. దీక్షా దివస్ స్ఫూర్తితో కొత్త ఉత్సాహంతో, నాటి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరం సైనికుల్లా కష్టపడదాం. వచ్చేది మన ప్రభుత్వమే. ప్రతి కార్యకర్తకూ బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే హరీశ్‌రావు, నేను అండగా ఉంటాం. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం పదేండ్లలో దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచింది. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలను, ఎమ్మెల్యేలను, నాయకులను టార్గెట్ చేస్తూ వేధిస్తున్నది. కేసీఆర్ పాలనే బాగుండేదని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ స్పూర్తితో పోరాడుదాం.
-కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు
తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక ఘట్టం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఆమరణ దీక్షకు నేటికి 15 ఏండ్లు పూర్తయ్యాయి. నాటి సమైక్యాంధ్ర పాలనలో రైతుల ఆత్మహత్యలు, వలసలు, కరువు, విద్యుత్ చార్జీల పెంపు వంటి అంశాలను చూసి నాటి డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ పదవులను, పార్టీని కాదని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ పోరాటం ప్రారంభించారు. కేసీఆర్ దీక్ష ఫలితంగానే రాష్ట్ర సాధన జరిగింది. దీక్షా దివస్ స్ఫూర్తితో మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీద్దాం. సిద్దిపేట గడ్డ.. ఉద్యమానికి అడ్డా. ఇద్దరు పులిబిడ్డలను అందించిన గొప్పగడ్డ.
– యాదవరెడ్డి, ఎమ్మెల్సీ
మలిదశ తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 29 నవంబర్ 2009లో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష అత్యంత కీలకమైంది. ఈ దీక్షతో ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు కేసీఆర్. మనందరికి స్ఫూర్తి ప్రదాత. సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని సీఎంగా బాధ్యతతో పనిచేసి దేశంలోనే అగ్రగామిగా కేసీఆర్ నిలిపారు. అన్నివర్గాల సంక్షేమానికి కృషిచేశారు. ప్రాజెక్టులు కట్టి, ఉచిత కరెంట్ ఇచ్చి, అభివృద్ధి చేసి తెలంగాణను కేసీఆర్ దేశానికి మాడల్‌గా నిలిపారు. కాంగ్రెస్‌ను ఏడాదిలోనే ప్రజలు ఛీ కొడుతున్నారు. కేసీఆర్, హరీశ్‌రావు నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదాం.
– వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్