సిద్దిపేట,సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణప్రతినిధి): ‘జిల్లాలోని రిజర్వాయర్లలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించాలి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం కొండ పోచమ్మసాగర్, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ కింద భూ నిర్వాసితులకు చేపలు పట్టుకునే అవకాశం ఉంటుంది’ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సిద్దిపేట జిల్లా అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పలు అంశాలను లేవనెత్తి జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురే ఖ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ…సిద్దిపేట జిల్లాలో సగం అన్నపూర్ణ సాగర్ ఉంటుందని, అకడ సిరిసిల్ల జిల్లా నిర్వాసితులకు ఆ అవకాశాన్ని కల్పించాలన్నారు. అన్నపూర్ణ రిజర్వాయర్‌లో కూడా సిద్దిపేట జిల్లా నిర్వాసితులకు అవకాశం కల్పించాలన్నారు.జిల్లాలో ఉన్న చెరువులు, రిజర్వాయర్లలో ఎప్పటిలోగా చేప పిల్లల పంపిణీ జరుగుతుందో ఇప్పటివరకు అధికారులు స్పష్టత ఇవ్వలేదన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రక్రియ ను ఎప్పటిలోగా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. కొనుగోలు విషయంలో సమస్యలు తలెత్తకుండా సివిల్ సైప్లెశాఖ ఏమైనా చర్చలు జరుపుతుందా? లేదా అని అడిగారు.
జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం కొన్ని నెలలుగా జరగడం లేదని హరీశ్‌రావు అన్నారు. కొండా సురేఖ సీనియర్ మంత్రిగా, శాసనసభ్యురాలిగా మీరు అభివృద్ధి కార్యక్రమాలకు తోడుగా ఉంటారనే నమ్మకం ఉందన్నారు. జిల్లాలో వ్యవసాయశాఖకు రెగ్యులర్ అధికారులు లేక ఆయిల్‌పామ్ సాగులో టార్గెట్ రీచ్ కాలేదన్నారు. పూర్తిస్థాయి వ్యవసాయాధికారిని నియమించాలని కోరారు. రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, రైతు భరోసా గైడ్‌లైన్స్ విడుదల చేసి రైతుబంధు డబ్బులను వీలైనంత త్వరగా ఇప్పించాలని కోరారు. పీఎం కిసాన్ ప్రారంభించినప్పుడు జిల్లాలో 1.77 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉంటే ఇప్పుడు 95 వేలకు తగ్గిందన్నారు.
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఈవిషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. పంట రుణమాఫీ విషయంలో 31 గైడ్‌లైన్స్ విధించడం వల్ల క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. రెండు లక్షల్లోపు పంట రుణమాఫీ కాని వాళ్లే 30 నుంచి 40శాతం మంది ఉం టారన్నారు. రెండు లక్షలపై ఉన్న డబ్బులు కట్టిన వారి కి ఇంకా రుణమాఫీ కాలేదని, ఈవిషయం పై కూడా స్పష్టత లేదన్నారు. వర్షాలకు కూరగాయలు, పండ్ల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ఖమ్మం, మ హబూబాబాద్ జిల్లాల్లో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించినప్పుడు సిద్దిపేట జిల్లాలో జరిగిన పం టలకు నష్టపరిహారం ఇప్పించాలని మంత్రిని కోరారు.
ఇక మేము పనిచేయలేకపోతున్నామని జిల్లాలోని పంచాయతీ సెక్రటరీలు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన పరిస్థితి వచ్చిందని హరీశ్‌రావు అన్నారు. పంచాయతీ సెక్రటరీలు తమ సొంత జీతం నుంచి లక్ష నుంచి లక్షా యాభైవేల వరకు ఖర్చు చేశారన్నారు. పంచాయతీ సెక్రటరీలకు పెండింగ్ నిధులు విడుదల చేయాలన్నా రు. దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, స్టీల్ బ్యాంకులను మూసివేయకుండా ప్రోత్సహించే విధంగా చూడాలని కోరారు.
సిద్దిపేటలో 250 హెక్టార్ల ఫారెస్ట్ పారును మరింత అభివృద్ధి చేయాలన్నారు.మల్లన్నసాగర్ రిజర్వాయర్‌కు ఉన్న సుందరమైన అడవిని మరింత అభివృద్ధి చేయాలన్నారు. సిద్దిపేట నర్సింగ్ కాలేజీలో సమస్యలు పరిష్కరించాలన్నారు. సిద్దిపేటలో 50 పడకల ఆయుష్ దవాఖాన పూర్తయిందని, దానిని ప్రారంభించాలన్నారు. ఆయుష్ దవాఖాన కోసం భూమి ఇచ్చిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు.
మోడల్ సూల్స్ కాంట్రాక్టు ఉపాధ్యాయుల వేతనా లు, కస్తూర్బా సూల్స్ మెస్‌బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని విడుదల చేయాలని హరీశ్‌రావు కోరారు. మన ఊరు -మనబడి కింద 80శాతం పను లు పూర్తయ్యాయని, మిగతా పనులను పూర్తిచేయాలన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేయాలన్నారు.
ఆర్అండ్బీ కింద రెండు రోడ్లు రద్దు చేశారని, 50 శాతం పనులు పూర్తయిన నాలుగు రోడ్లను నిలిపివేశారన్నారు. మూడు రోడ్ల టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభించలేదన్నారు. పంచాయతీరాజ్‌లో రూ. 45 కోట్ల విలువ చేసే 19 పనులను రద్దు చేశారని, రద్దు చేసిన పనులను తిరిగి ప్రారంభించాలన్నారు. జిల్లాలో పనులు ప్రారంభించిన పశు వైద్య కళాశాలను రద్దు చేశారని, తిరిగి ప్రారంభించాలని ఆయన కోరారు.