సిద్దిపేట టౌన్,ఆగస్టు 18 : సమ సమాజ నిర్మాణ స్థాపనకు పోరు సలిపిన గొప్ప పోరాట యోధుడు,17 శతాబ్దంలోనే బహుజన చక్రవర్తిగా కీర్తిగడించి చర్రితలో పుట్టలో నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మన అందిరికీ ఆదర్శమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు.జిల్లాకేంద్రం సిద్దిపేటలో ఆదివారం జరిగిన పాపన్నగౌడ్ 374వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఆయనను స్మరించుకున్నారు.అనంతరం మాట్లాడుతూ..సర్దార్ పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
గౌడ్ సోదరులు పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని, భవిష్యత్‌లోను ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు.అంతకు ముందు సలాం గౌడన్న పాటల సీడీని హరీశ్‌రావు ఆవిష్కరించారు. గౌడ సంఘం వారు నిర్వహించిన ర్యాలీ ని జెండా ఊపి ప్రారంభించారు. గౌడ్ కులస్తుల సంక్షేమానికి కేసీఆర్ ఎంతో కృషిచేశారన్నారు. గీత కార్మికులకు చెట్టు పన్ను రద్ద చేశారని, సొసైటీలను పునరుద్ధరించి గౌడ్ కులస్తులు వైన్స్‌ల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. పెద్దఎత్తున ఈత వనాలను పెంచి వారికి ఉపాధి కల్పించారన్నారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడితే రూ.6 లక్షల ప్రమాద బీమా కల్పించారని గుర్తుచేశారు.
కేసీఆర్ పాలనలో కల్లు డిపోల మీద అక్రమ కేసులు, ఎక్సైజ్ శాఖ వేధింపులు లేకుండేవని, కాంగ్రెస్ ప్రభుత్వంలో గీత కార్మికులపై అక్రమ కేసులు నమోదు చేయించి వేధించడం, కల్లు డిపోల మీద దాడులు చేయిస్తూ గౌడ కులస్తులను తీవ్ర మనో వేదనకు గురిచేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. గీత కార్మికులను వేధించడం తక్షణమే ప్రభుత్వం మానుకోవాలని, వారి సంక్షేమానికి పాటుపడాలని హితవు పలికారు. మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, మారెడ్డి రవీందర్‌రెడ్డి,మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, పాల సాయిరాం, మరుపల్లి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ వినోద్‌గౌడ్, గౌడ్ సంఘం నేతలు పల్లె కిషన్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.