చేర్యాల, సెప్టెంబర్ 27: ప్రజలకు మేలు చేసే పథకాలు కొనసాగిస్తామని దేవాదాయశాఖ, అటవీశాఖల మంత్రి కొండా సురేఖ అన్నా రు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని రేణుకాగార్డెన్లో శుక్రవారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు చెందిన 242 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల వల్ల ఎన్నో కుటుంబాలకు మేలు జరిగిందని, అవే పథకాలను కేసీఆర్ ప్రభుత్వం కొనసాగించిందన్నారు.
ఆరు గ్యారెంటీలను అమలు చేయడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.త్వరలో ప్రజలకు కొత్త రేషన్,హెల్త్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తున్నదని, త్వర లో ప్రతి ఒక్కరికీ స్మార్ట్‌కార్డు మంజూరవుతుందన్నారు.నియోజకవర్గానికి 3500 ఇండ్ల మంజూరు చేస్తున్నామని, త్వరలో వాటిని లబ్ధిదారులకు ఇస్తామన్నారు.ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వినతి పత్రం రూపంలో అందజేసిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని, నిధులు మం జూరు చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు.కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడారు. పార్టీలకతీతంగా గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి సహకరించిందని, అభివృద్ధికి నోచుకోని చేర్యాల ప్రాంతం పై మంత్రి కొండా సురేఖ ప్రత్యేక దృష్టిసారించి నిధులు మంజూరు చేయాలని, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని కోరారు.ఇటీవల జరిగిన జిల్లా సమావేశంలో మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకువెళ్లిన కడవేర్గు వంతెన నిర్మాణం, ధూళిమిట్టలో సెంట్రల్ లైటింగ్ పనుల కార్యరూపం దాల్చినట్లు తెలిపారు.
చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, చేర్యాలలో కోర్టు ప్రారంభించనున్న క్రమంలో సిబ్బందిని కేటాయించాలన్నారు.చేర్యాల-నాగపురి రోడ్డును శభాష్‌గూడెం వరకు డబుల్ రోడ్డుగా మార్చాలని, నిత్యం ఈ రహదారిలో ప్రమాదాలు జరిగి ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దూరులో పేదలకు ఇంటి స్థలాలు కేటాయించినా పట్టాలు ఇవ్వలేదని, వెంటనే ఇవ్వాలని కోరారు.కొమురవెల్లి మల్లన్న ఆలయానికి 132 ఎకరాల భూమిని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిందని, మల్లన్న భూములు ఆక్రమణకు గురవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, దాని పై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఇండ్లు మంజూరు చేయాలన్నారు.
పార్టీలకతీతంగా చేర్యాల, జనగామ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో సదానందం, తహసీల్దార్ సమీర్అహ్మద్ఖాన్, లక్ష్మీనారాయణ,సంజీవ్‌కుమార్, మధుసూదన్, పీఏసీఎస్ చైర్మన్ మెరుగు కృష్ణాగౌడ్, ఆర్ఐ రాజేందర్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు మంగోలు చంటి, ఆడెపు నరేందర్, చెవిటి లింగం, పచ్చిమడ్ల సతీశ్, యాట కనకమ్మ,ముస్త్యాల తార, తుమ్మలపల్లి లీల పాల్గొన్నారు.