చేర్యాల, ఏప్రిల్ 8: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు చేర్యాల ప్రాంతం నుంచి ఊరూరి నుంచి ఉప్పెనలా తరలిరావాలని, గులాబీ సైనికులు సభను విజయవంతం చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎల్కతుర్తి భారీ బహిరంగ సభకు సంబంధించిన సన్నాహక సమావేశం మంగళవారం చేర్యాలలోని రేణుకా గార్డెన్స్‌లో నిర్వహించారు.
ఈ సన్నాహాక సమావేశానికి చేర్యాల టౌన్, చేర్యాల, కొమురవెల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సభకు సంబంధించిన ఏర్పాట్లు, వసతులు, రవాణా తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు, పార్టీ కార్యకర్తలు సభకు హాజరయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రజితోత్సవ సభకు సకాలంలో బయలుదేరి సభాస్థలికి చేరుకోవాలని, ఐక్యమత్యంగా గులాబీ శ్రేణులు దండుకట్టి తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వ తీరుతో ఎండిన పంటలు..
కాంగ్రెస్ సర్కారు అవగాహన రాహిత్యంతో ఈరోజు తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు చుక్క నీరు రాలేదని, దీంతో చేర్యాల ప్రాంతంలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అవకాశం దక్కిన ప్రతిసారి తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి నీటి విడుదలతో పాటు చేర్యాల ప్రాంత సమస్యలపై తాను గళమెత్తినట్లు గుర్తుచేశారు. 2004-2014 వరకు దేవాదుల ఎత్తిపోతల పథక ద్వారా కేవలం 40వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో 2014-2023 వరకు 5.14 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించామని గుర్తుచేశారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ కెనాల్స్ నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు గ్రావిటీ ద్వారా నీటిని అందించేందుకు సీఎం కేసీఆర్ ఆనాడు రూ.350 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభింపజేస్తే, నేడు కాంగ్రెస్ సర్కారు పనులను పెండింగ్‌లో పెట్టడడంతో తపాస్‌పల్లి ఎండిపోయిందన్నారు. దీంతో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు సాగునీరు లేక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.
ఒకపార్టీ తర్వాత ఒకపార్టీ మారుతూ ఊసరవెల్లి ఎమ్మెల్యే ఒకరు ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటున్నారని, ఆంధ్రా అల్లుడితో కలిసి పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖలను గుప్పెట్లో పెట్టుకుని బినామీల పేరిట అటవీ భూములు కొనుగోలు చేస్తున్నాడని, ఊసరవెల్లి ఎమ్మెల్యే ముసుగు త్వరలో తొలిగిస్తామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఊసరవెల్లి ఎమ్మెల్యే ఆంధ్రా అల్లుడితో చేయిస్తున్న అఘాయిత్యాలు, కబ్జాలు అన్ని లెక్కిస్తున్నామని, త్వరలో ఆయన లెక్క తెలుస్తామన్నారు.
అణిచివేత, అక్రమ కేసుల నమోదుకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం గులాబీ సైనికులు పోరాడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ముస్త్యాల బాల్‌నర్సయ్య, అంకుగారి శ్రీధర్‌రెడ్డి, అనంతుల మల్లేశం, మేడిశెట్టి శ్రీధర్, సుంకరి మల్లేశం, గీస భిక్షపతి, ముస్త్యాల నాగేశ్వర్రావు,తలారీ కిషన్, సిలువేరు సిద్దప్ప, పెడుతల ఎల్లారెడ్డి, గూడూరు బాలరాజు, నిమ్మ రాజీవ్‌రెడ్డి, మంగోలు చంటి, వకులాభరణం నర్సయ్య పంతులు, కాగితా రాజేందర్‌రెడ్డి, సార్ల కిష్టయ్య, తాడెం రంజితాకృష్ణమూర్తి, మీస పార్వతి, కార్యకర్తలు పాల్గొన్నారు.