నిజాంపేట,సెప్టెంబర్3 : అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ తన నివాసంలో ఎమ్మెల్యే మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్ మున్నూరు కాపు సంఘం నిర్మాణానికి రూ.5 లక్షలను మంజూరు చేస్తూ ప్రొసిండింగ్ ప్రతాలను ఆ సంఘం సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను సమానంగా ఆదరిస్తున్నారని చెప్పారు. అందులో భాగంగా కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించారని గుర్తు చేశారు. సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా దళితబంధు, చేతివృత్తి దారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్లే సాధ్యమైందన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఎంపీపీ సిద్ధిరాములు, బీఆర్ మండల అధ్యక్షుడు సుధాకర్, కాపు సంఘం సభ్యులు ఉన్నారు.