నారాయణఖేడ్, ఆగస్టు 30: నారాయణఖేడ్ నియోజకవర్గ రాజకీయ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా తన రికార్డులను తానే తిరగరాస్తూ, రెండు సార్లు భారీ మెజార్టీతో గెలుపొంది, మూడోసారి విజయంతో హ్యాట్రిక్ రికార్డు సాధించేందుకు సిద్ధమవుతున్నారు ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి. 2016 ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2018 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించగా, కేవలం ఏడేండ్ల తన హయాంలో సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గ రేపురేఖలను మార్చి ప్రజల దీవెనలు పొందేందుకు మరోసారి బరిలో దిగనున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో మూడోసారి తాను ఎమ్మెల్యేగా ఎన్నికై, నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో నెంబర్‌వన్ స్థాయిలో నిలపాలన్నదే తన ఆకాంక్ష అని, ఇందుకోసం చేయాల్సిన పనులను ముందే నిర్దేశించుకున్నానని పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ నమ్ముకున్న వారికి అండగా ఉంటారని చెప్పడానికి వరుసగా తనకు ఐదుసార్లు ఎమ్మెల్యే టికెట్ కేటాయించడమే నిదర్శనమని, తన దృష్టిలో రాజకీయమంటే సేవాభావమని తన మనోగతాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
ప్రజలే నా కుటుంబమని..వారి దీవెనలతో మూడోసారి బరిలోకి దిగుతున్నానని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. నమ్ముకున్న వారికి అండగా నిలిచే మనస్తత్వం సీఎం కేసీఆర్‌దని, ఆయన ఆశీస్సులతో అధిక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆదరిస్తున్న ప్రజల రుణం తీర్చుకుంటానని, వారికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో నంబర్‌వన్ స్థాయిలో నిలపాలన్నదే తన ఆకాంక్ష అని, ఇందుకోసం చేయాల్సిన పనులను ముందే నిర్దేశించుకున్నానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నమ్ముకున్న వారికి అండగా ఉంటారని చెప్పడానికి వరుసగా తనకు ఐదుసార్లు ఎమ్మెల్యే టికెట్ కేటాయించడమే నిదర్శనమని, తన దృష్టిలో రాజకీయమంటే సేవాభావమని తన మనోగతాన్ని ‘నమస్తే తెలంగాణ’తో ఎమ్మెల్యే పంచుకున్నారు. –
న.తె: ఏడేండ్ల ఎమ్మెల్యే పదవీ కాలంలో చేపట్టిన అభివృద్ధి?
ఎమ్మెల్యే: నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడేండ్లయినా అభివృద్ధి విషయానికి వస్తే నేను ఫ్రీహ్యాండ్గా పని చేసింది మాత్రం ఐదేండ్లనే చెప్పాలి. ఎందుకంటే నోట్ల రద్దు, కరోనా ఈ రెండు కారణాల వల్ల నిధుల కొరతతో పాటు ఇతర అవరోధాలు రావడంతో అభివృద్ధి పనుల్లో కొంత ఇబ్బంది పడ్డాం. సమైక్య రాష్ట్రంలోని ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి 2014 తర్వాత జరిగిన అభివృద్ధిని పోల్చుకుంటే భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి రైతులు ధాన్యం విక్రయించేందుకు అనువుగా రూ.10 కోట్లతో మార్కెట్‌యార్డు, గోదాంలు నిర్మించాం. నాణ్యమైన విద్యుత్‌ను అందించేలా కొత్తగా రూ.25 కోట్లతో 15 కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేశాం. నారాయణఖేడ్‌లో అధునాతన రీతిలో రూ.16 కోట్లతో 100 పడకల ఏరియా దవాఖాన, రూ.11 కోట్లతో మాతాశిశు దవాఖాన నిర్మించాం. కల్హేర్, కరస్గుత్తిల పీహెచ్‌సీలను 30 పడకలకు అభివృద్ధి చేశాం. తండాలకు రోడ్డు సౌకర్యం కోసం రూ.83 కోట్లు వెచ్చించాం. మిగతా ప్రధాన రహదారులను అభివృద్ధి చేసేందుకు పెద్దఎత్తున నిధులతో రోడ్లను మెరుగుపర్చుకున్నాం.
దాదాపు రూ.300 కోట్లతో మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లా నీళ్లిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మిషన్ కాకతీయలో రూ.80 కోట్లతో చెరువులను బాగు చేసుకున్నాం. నల్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.25 కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో 1.34 లక్షల ఎకరాలకు సాగునీరందించి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం నిర్మించతలపెట్టిన బసవేశ్వర ఎత్తిపోతల పథకం కోసం సీఎం కేసీఆర్ రూ.1,774 కోట్లు మంజూరు చేసి, పనులు ప్రారంభించారు. కొత్తగా ఎనిమిది చెరువుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. రూ.35 కోట్లతో అవసరమున్న చోట హైలెవల్ వంతెనల నిర్మాణాలు చేపట్టాం. మున్సిపాలిటీగా ఏర్పాటైన నారాయణఖేడ్ పట్టణంలో రూ.100 కోట్లతో పనులు చేశాం. నారాయణఖేడ్‌లో ఆర్డీవో కార్యాలయం, డీఎస్పీ కార్యాలయం, మనూరులో జూనియర్ కళాశాల, ఎనిమిది రెసిడెన్షియల్ పాఠశాలలు, కంగ్టిలో సీఐ కార్యాలయం, నీటిపారుదలశాఖ స్థాయిని పెంచుతూ ఈఈ కార్యాలయం, మూడు కొత్త మండలాలు, కొత్తగా 60 తండాలను పంచాయతీలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవే కాకుండా ఇంకా చాలా పనులు చేశాం.
నమస్తే తెలంగాణ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఐదుసార్లు అవకాశం దక్కడంపై మీ అభిప్రాయం?
ఎమ్మెల్యే: నమ్ముకున్న వారికి సీఎం కేసీఆర్ అండగా ఉంటారని చెప్పడానికి నేనే ఒక ఉదాహరణ. వరుసగా ఐదుసార్లు పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించడం, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడం, ఇప్పుడు మరోసారి బరిలో నిలవడం చాలా సంతోషంగా ఉంది. 2009 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా నారాయణఖేడ్ టికెట్‌ను బీఆర్ఎస్కు కేటాయించి నాకు అవకాశమిచ్చారు. 2014, 2016లలో అనేక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ నాకు అవకాశమిచ్చి ఎమ్మెల్యేను చేశారు. సీఎం కేసీఆర్‌కు ఎప్పటికి రుణపడి ఉంటా.
న.తె: వచ్చే ఎన్నికల్లో నారాయణఖేడ్‌లో బీఆర్ఎస్ విజయంపై మీ అంచనా?
ఎమ్మెల్యే: 2016 ఉప ఎన్నికల్లో నాకు 53 వేల పైచిలుకు మెజార్టీ, 2018 ఎన్నికల్లో 58 వేల మెజార్టీ సాధించాం. సీఎం కేసీఆర్ సార్ ప్రవేశపెట్టిన పథకాలు, నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతున్న తీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారు. అభివృద్ధి విషయంలో చెప్పాలంటే తెలంగాణ రాష్ర్టానికి ముందు, తర్వాత అని బేరీజు వేసుకుంటే జరిగిన మార్పు అర్థమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి పథకం అవినీతి మయం, ఇప్పుడు పథకాలన్నీ పారదర్శకంగా అమలవుతున్నాయి. ప్రతి రంగం అభివృద్ధి చెందింది. ప్రజలు విజ్ఞులు, వారికి అన్నీ తెలుసు, ప్రజల ఆశీస్సులతో ఈసారి గత రెండుసార్ల కంటే ఎక్కువ మెజార్టీతో విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది.
న.తె: మీ అభిరుచుల గురించి చెప్పండి..
ఎమ్మెల్యే: నాకంటు ప్రత్యేకమైన అభిరుచులు ఏమీలేవు. నిత్యం ప్రజల మధ్య ఉండి వారితో మమేకమై పని చేయడంలోనే ఎంతో సంతృప్తి కలుగుతుంది. మా నియోజకవర్గ ప్రజలు చాలా అమాయకులు వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడమంటే ఇష్టం. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్న వారు ఏవైనా అధికారిక కార్యక్రమాలు ఉంటే తప్పా స్థానికంగా ఉండేవారు కాదు. హైదరాబాద్‌లోనే గడిపేవారు. కానీ, నేను మాత్రం ప్రతిరోజు నియోజకవర్గ ప్రజల మంచి చెడుల్లో భాగమై పనిచేస్తా. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 వరకు ప్రజలకు అందుబాటులో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. నియోజకవర్గ ప్రజలే నా కుటుంబం మాదిరిగా భావిస్తా, కాబట్టే నా కుటుంబం కంటే ఎక్కువగా ప్రజలకే సమయం కేటాయిస్తా. నేను ఎమ్మెల్యే కాకముందు పుస్తకాలు చదవడం, క్రికెట్ ఆడడం, వ్యాయామం చేయడం వంటివి చేసేవాడిని. ఇప్పుడంతా ప్రజాజీవితమే. ఏది చేసినా ప్రజల కోసమే.
న.తె: నియోజకవర్గంలో ఊహించని అభివృద్ధి ఎలా సాధ్యమైంది?
ఎమ్మెల్యే: నియోజకవర్గ ప్రజలు నన్ను రెండుసార్లు రికార్డు మెజార్టీతో గెలిపించడంతో ప్రజలు నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారనే విషయం అర్థమైంది. ఇంతకింతకు నాపై బాధ్యత పెరుగుతుందని భావించి, సమైక్య రాష్ట్రంలో వివక్షకు గురైన రంగాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించడం, అందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తూ వెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాం. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి హరీశ్‌రావు సహకారం ఉండడంతోనే గతంలో వెనుకబాటు ప్రాంతంగా ఉన్న నారాయణఖేడ్ ఊహించని రీతిలో అభివృద్ధి సాధించింది.
న.తె: మీ సొంత ఖర్చుతో ఏవైనా కార్యక్రమాలు చేపట్టారా?
ఎమ్మెల్యే: మా బాబు రోషన్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్న ఎంబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతాం. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన సందర్భాల్లో మా నియోజకవర్గ యువతీయువకలకు సౌకర్యం కల్పిస్తూ నేను నా సొంత ఖర్చుతో కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి, హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి, మూడు నెలల పాటు కోచింగ్ ఇప్పించాం. అంతేకాకుండా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి కోచింగ్ పూర్తయిన తర్వాత మెటీరియల్ పంపిణీ చేశాం. ఇప్పటికి రెండుసార్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ మధ్య నారాయణఖేడ్‌లో డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహించి సొంత ఖర్చుతో యువతకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే ఏర్పాటు చేశాం. దీనికి చాలామంచి స్పందన లభించింది. వీలు కలిగినప్పుడు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయనిధి చెక్కులను నేను స్వయంగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి అందజేస్తాను. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వారికి క్రీడా సామగ్రిని పంపిణీ చేయడం వంటివి చేస్తుంటాం.
న.తె: అభివృద్ధి విషయంలో ఈసారి మీ ముందున్న లక్ష్యం ఏమిటి?
ఎమ్మెల్యే: నా లక్ష్యం ఒక్కటే, గుక్కెడు నీటి కోసం పరితపించిన ఈ ప్రాంతంలో ఎప్పటికైనా ప్రతి ఎకరాకూ సాగు నీరందాలి. సీఎం కేసీఆర్ దయతో బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడంతోపాటు కొత్తగా ఎనిమిది చెరువుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఈసారి వాటిని పూర్తిచేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే దిశగా దృష్టి సారిస్తా. మరిన్ని చెరువుల నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉంది. నిజాంపేట-బీదర్ జాతీయ రహదారి పనులు పూర్తి చేసి అంతర్రాష్ట్ర రవాణాను మెరుగుపర్చాల్సిన అవసరమున్నది.
న.తె: రాజకీయానికి మీరు చెప్పే నిర్వచనం?
ఎమ్మెల్యే: రాజకీయమంటే కచ్చితంగా సేవాభావమే. సేవాదృక్పథం ఉన్న నాలాంటి వారికి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రాజకీయమనేది ఒక వేదికంగా ఉపయోగపడుతుంది. నేను ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తా. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండడం, వారి కష్టాసుఖాల్లో పాలుపంచుకోవడం వంటివి నాకెంతో సంతృప్తినిస్తాయి. నిష్పక్షపాతంగా ప్రజలకు సేవలందించడమే పరమావధిగా, అవినీతికి తావులేకుండా ప్రజలకు ఫలాలు అందించడం నా బాధ్యతగా భావిస్తా.
న.తె: ఎమ్మెల్యేగా, బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రజలకు మీరిచ్చే సందేశం?
ఎమ్మెల్యే: ప్రజలు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అన్ని పార్టీల నాయకులను, ఆయా పార్టీల ప్రభుత్వాల పాలనను చూశారు. అప్పుడు చేయలేని పనులు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇక నాయకుల విషయానికి వస్తే గత నాయకుల పనితీరు, నా పనితీరు కూడా ప్రజలకు తెలుసు. అన్ని వారి కళ్లముందు ఉన్నాయి. ఎన్నికల సమయంలో అన్ని పార్టీల వారు ఓట్ల కోసం సవాలక్ష మాటలు చెప్తారు. కానీ, ఇచ్చిన హామీలను అమలు చేసే పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే. మంచి చెడులను గుర్తించి ఏమాత్రం అయోమయానికి గురి కాకుండా స్పష్టమైన తీర్పు ఇస్తారనే నమ్మకం ఉంది.
ఓటరు జాబితా పారదర్శకంగా తయారుచేయాలి
పారదర్శకంగా ఓటర్ల జాబితా తయారు చేయాలని బీఎల్వోలను జిల్లా ఎన్నికల అధికారి, మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల బీఎల్వోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాల బీఎల్వోలు మాత్రమే విధులు నిర్వర్తించాలన్నారు. వచ్చేనెల 2, 3 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రెండు రోజుల ముందు నుంచి గ్రామాల్లో దండోరా ద్వారా ప్రచారం చేయాలన్నారు. జిల్లాలో 18, 19 ఏండ్ల స్త్రీ, పురుష నిష్పత్తి ప్రకారం మహిళా ఓటర్లు నమోదు కావడం లేదని, వంద శాతం నమోదయ్యేలా బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఫారం-6 ద్వారా నూతన ఓటర్ల పేర్లను నమోదు చేయాలన్నారు. ఫారం-6, 7, 8లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నూతన ఓటర్ల నమోదుతోపాటు ఫారం-7 ద్వారా అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్లు, యువజన సంఘాల సభ్యులతో కలిసి గ్రామస్తులతో చర్చించి చనిపోయిన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలిగించాలన్నారు.
ఫారం-8 ద్వారా ఓటర్ లిస్టులో తప్పొప్పుల సవరణ చేయాలన్నారు. వచ్చిన దరఖాస్తులన్నీ వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి అధికారులకు దరఖాస్తులను అందించాలన్నారు. ట్రాన్స్‌జెండర్, అనాథలను ఓటరుగా నమోదు చేసేందుకు బీఎల్వోలదే ఆఖరి నిర్ణయమన్నారు. 9 సెప్టెంబర్-2023న ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ‘చునావ్ పాఠశాల’ కార్యక్రమం నిర్వహించాలని, అందులో యువత, రిసోర్స్ పర్సన్లు, ఎస్‌హెచ్‌జీ గ్రూపులు, టీచర్లను భాగస్వామ్యం చేసి, విసృ్తత ప్రచారం చేయాలన్నారు. అకడే 18-19 ఏండ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. ఓటరు జాబితాను తప్పులు లేకుండా ఉండడానికి సూపర్వైజర్లు సహాయ ఎన్నికల అధికారులు క్రాస్ చెక్ చేయాలన్నారు. అక్టోబర్ 4న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. బీఎల్వోలు తమ పోలింగ్ కేంద్రం పరిధిలో శాశ్వతంగా వలస పోయిన వీవీఐపీ ఓటర్ల వివరాలు రాజకీయ పార్టీల ఏజెంట్లు, గ్రామస్తులతో చర్చించి జాబితా నుంచి తొలిగించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, డీఎఫ్‌వో రవిప్రసాద్, ఆర్డీవోలు అంబదాస్ రాజేశ్వర్, జయ చంద్ర, డీడబ్ల్యూవో బ్రహ్మజీ, ఏఈఆర్వోలు, బీఎల్వోలు, సూపర్ వైజర్లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.