మనూరు, ఏప్రిల్ 4: బీఆర్ఎస్ పార్టీ జెండా ఎర్ర కోటపై ఎగరాలే అనే పట్టుదల అందరిలోనూ కనిపిస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మనూరు మండల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నారాయణఖేడ్ హెచ్ఆర్ ప్యాలెస్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ జూటా పార్టీ (బీజేపీ)ని ప్రజలు నమ్మడం లేదని, బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పక్క రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో పలు పార్టీల నాయకులు, ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతూ పార్టీలో చేరుతున్నారన్నారు. తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని, ఆ పార్టీల నాయకులకు కూడా తెలుసేనన్నారు. పక్క రాష్ట్రంలో బార్డర్లో ఉన్న ప్రజలు మన మిషన్ భగీరథ నీటిని తీసుకుని వెళ్తున్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కనీసం ప్రజలకు తాగడానికి కూడా తాగునీరు అందించలేదన్నారు.
మత రాజకీయాలు చేస్తూ కాలం గడుపుతున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆడుకుని వారి నడ్డి విరిచారన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి రైతు బిడ్డ అని, రైతుల బాధలు తెలుసుకున్నాడు కాబట్టి రైతులను అన్ని విధాలా ఆదుకుంటూ పాలన సాగిస్తున్నారన్నారు. ఒక్క చాన్స్ ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా అని ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్‌రెడ్డి మాట్లాడంటం విచిత్రంగా ఉందన్నారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని పార్టీల నాయకులు, కార్యకర్తలు పంచుకున్నారే తప్ప నిరు పేద ప్రజలకు అందలేదన్నారు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు డీవోసీ నిధులతో వారి కాలేజీకి సీసీ రోడ్డు వేసుకున్నారే తప్ప గ్రామాల్లో ఎక్కడా సీసీ రోడ్లు వేయలేదన్నారు. ఖేడ్‌లో మూడు పార్టీలు ఒక్కటైనా ఏమీ చేయలేరన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సైన్యంలా పనిచేస్తున్నారని, వారే మాకు బలం, బలగం అన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని సన్మానించారు. సమావేశంలో ఎంపీపీ కొంగరి జయశ్రీ మొహన్రెడ్డి, వైస్ ఎంపీపీ రాములు, పార్టీ మండల అధ్యక్షుడు విఠల్‌రావు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నాగప్ప పాటిల్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు అంబారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు జనార్థన్‌రెడ్డి, పార్టీ మండల యూత్ అధ్యక్షుడు కృష్ణ, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.