వెంటాడిన మృత్యువు
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితను మృత్యువు వెంటాడిందనే చెప్పాలి. ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మూడు సార్లు ప్రమాదానికి గురయ్యారు. మొదటిసారిగా లిఫ్ట్‌లో ఇరుక్కుపోగా, ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగిన ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
- రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం
- సదాశివపేట దర్గాలో గురువారం రాత్రి నందిత ప్రార్థనలు
- ఇంటికి చేరుకుని తిరిగి అల్పాహారం కోసం వెళ్తుండగా ప్రమాదం
- గాంధీ దవాఖానలో పోస్టుమార్టం డ్రైవర్‌కు గాయాలు..
- కుటుంబ సభ్యులను పరామర్శించిన హరీశ్‌రావు
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితను మృత్యువు వెంటాడిందనే చెప్పాలి. ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మూడు సార్లు ప్రమాదానికి గురయ్యారు. మొదటిసారిగా లిఫ్ట్‌లో ఇరుక్కుపోగా, ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగిన ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మూడోసారి ఓఆర్ఆర్ పటాన్చెరు వద్ద జరిగిన ప్రమాదంలో మృత్యువు ఆమెను కబళించేసింది.
పటాన్చెరు, ఫిబ్రవరి 24 ః శుక్రవారం తెల్లవారుజామున ఔటర్ రింగురోడ్డు రక్తసిక్తమైంది. సికింద్రాబాద్ -కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జ్ఞాని లాస్య (37) రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలకు గురై సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. డ్రైవర్ ఆకాశ్ తీవ్రంగా గాయపడ్డారు. అడిషనల్ ఎస్పీ ఏ సంజీవరావు, పటాన్చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి తెలిపిన కథనం ప్రకారం సికింద్రాబాద్ – కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జ్ఞాని లాస్య నందిత (38) గురువారం రాత్రి 11గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలసి రెండు కార్లలో సదాశివపేట మండలం ఆరూర్ గ్రామంలోని మిస్కిన్ షా బాబా దర్గాను దర్శించుకున్నారు. అక్కడ ప్రార్థనలు చేసి, రాత్రి ముంబయి హైవేపై సికింద్రాబాద్‌లోని ఇంటికి చేరుకున్నారు. అనంతరం లాస్య నందితకు ఆకలివేయడంతో అల్పాహారం తినేందుకు డ్రైవర్ ఆకాశ్‌తో కలిసి బయలు దేరారు. దర్గాకు వెళ్లే సమయంలో ముంబాయి హైవేపై అనేక హోటల్స్ చూడటంతో అక్కడే తినాలని అనుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున దాదాపు 4.45 ప్రాంతంలో శామీర్‌పేట్ ఓఆర్ఆర్ ఎక్కారు. సుల్తాన్పూర్ టోల్‌ప్లాజా దాటిన తరువాత 5.10 గంటల ప్రాంతంలో పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని పటేల్‌గూడ సమీపంలోకి రాగానే డ్రైవర్ ఆకాశ్ నిద్రమత్తులో ముందున్న వాహనాన్ని ఢీ కొట్టబోయాడు.
వెంటనే తేరుకుని ప్రమాదాన్ని తప్పించేందుకు ప్రయత్నించగా, వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఎడమవైపు ఉన్న ఓఆర్ఆర్ మెటల్ బీమ్‌ను బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే జ్ఞాని లాస్య నందిత తీవ్రగాయాలకు గురై సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. డ్రైవర్ ఆకాశ్‌కు గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు, ఎమ్మెల్యే ప్రాణాలతో ఉండొచ్చని భావించి అంబులెన్స్‌లో పటాన్చెరు పట్టణంలోని అమేధ దవాఖానకు తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన డాక్టర్లు ఎమ్మెల్యే జ్ఞాని లాస్య నందిత అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. డ్రైవర్ ఆకాశ్‌కు మెరుగైన చికిత్స అందించేందుకు మదీనాగూడలోని శ్రీకర దవాఖానకు తరలించగా, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
పటాన్చెరు సీఐ ప్రవీణ్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎంవీఐ పటాన్చెరు, డీఎస్పీ రవీందర్‌రెడ్డి, పోలీసుశాఖ అధికారులు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. శ్రీకర దవాఖానలో చికిత్స పొందుతున్న డ్రైవర్ ఆకాశ్‌ను కలిసి ప్రమాద కారణాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రంతా సదాశివపేటకు వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చిన క్రమంలో ఆకలి కావడంతోనే రింగ్‌రోడ్డుపై ప్రయాణించారని పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఎమ్మెల్యే పటాన్చెరు ప్రాంతంలోని హైవేపై ఉన్న హోటల్స్‌లో అల్పాహారం తినాలని అనుకుని రింగ్‌రోడ్డుపై నుంచి వెళ్దామని డ్రైవర్‌కు చెప్పడంతో ఓఆర్ఆర్పైకి కారును తీసుకెళ్లాడు. పటేల్‌గూడ వద్ద కారు ప్రమాదానికి గురై విషాదం చోటుచేసుకుంది.
హుటాహుటిన వచ్చిన ఎమ్మెల్యే హరీశ్‌రావు
ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారనే సమాచారం తెలియడంతో దిగ్భ్రాంతి చెందిన సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్‌రావు హుటాహుటిన పటాన్‌చెరులోని అమేధ దవాఖానకు చేరుకున్నారు. కన్నీటి పర్యంతమవుతున్న కుటుంబసభ్యులను పరామర్శించారు. పార్టీ మంచి యువ నాయకురాలిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నందిత మరణ వార్తతో బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో దవాఖానకు తరలివచ్చారు. పలువురు కార్పొరేటర్లు, నాయకులు లాస్య నందిత మృతదేహాన్ని చూసి విలపించారు. అక్కడి నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. అంబులెన్స్‌తోపాటు హరీశ్‌రావు గాంధీ దవాఖానకు వెళ్లారు.
మంత్రి దామోదర సంతాపం
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంతాపం ప్రకటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన మంత్రి ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరాఉ. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న యువ ఎమ్మెల్యే ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు.
ఎమ్మెల్యే మృతికి మంత్రి పొన్నం సంతాపం
హుస్నాబాద్, ఫిబ్రవరి 23: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచి అకాల మృతి చెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. గత సంవత్సరం ఇదే నెలలో లాస్య తండ్రి సాయన్న మృతి నుంచి కోలుకోక ముందే ఆయన కూతురు లాస్య నందిత మృతి ఆకుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చిందన్నారు. లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
లాస్య నందిత మృతి బాధాకరం
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందనే వార్త దిగ్బ్రాంతికి గురిచేసింది. ప్రజామన్ననలతో చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య నందిత అర్ధాంతరంగా దివంగతులు కావడం చాలా బాధాకరం. ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ సాయన్న ఎంతో ప్రజాభిమానం ఉన్న నాయకుడు. రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయురాలుగా కీర్తిప్రతిష్టలు సంపాదిస్తుందని అనుకున్నాం. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
– సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే, నర్సాపూర్.
లాస్యనందిత మృతి కలిచివేసింది
– దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక, ఫిబ్రవరి 23: యువ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మృతి కలిచివేసిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్లో ప్రజల మనిషి సాయన్న వారసురాలిగా ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన ఆమె ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమన్నారు. ఏడాది క్రితం సాయన్న మరణించడం, ఇప్పుడు ఆయన కుమార్తె మృతి చెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఇటీవల నల్లగొండ బీఆర్ఎస్ సభకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత గాయపడి కొలుకుని అసెంబ్లీకి వచ్చిందన్నారు. ఆమె మృతి తీరని లోటని, ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
యువ ఎమ్మెల్యే మృతి బాధాకరం
– ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
చేర్యాల, ఫిబ్రవరి 23 : కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం బాధాకరమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ప్రమాద ఘటన వద్దకు వెళ్లి అక్కడి నుంచి దవాఖానకు వెళ్లారు. లాస్య నందిత మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్యనందిత నియోజకవర్గ ప్రజల అభిమానాలు చూరగొందన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
యువనాయకురాలిని కోల్పోయాం
రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసింది. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురుగా, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ కంటోన్మెంట్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న లాస్య నందిత మరణం బీఆర్ఎస్కు తీరనినష్టం. కంటోన్మెంట్ ప్రజలు మంచి యువనాయకురాలిని కోల్పోయారు. నందిత కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుతున్నాను.
– గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే, పటాన్చెరు
సంతాపం ప్రకటించిన ఎమ్మెల్సీ
మెదక్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మంచి భవిష్యత్ ఉన్న యువ ఎమ్మెల్యే ఆకస్మిక మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి సాయన్న సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేశారని గుర్తుచేశారు. సాయన్న కుమార్తె ఎమ్మెల్యేగా ఎన్నికైన స్వల్ప కాలానికే మరణించడం దురదృష్టకరమన్నారు. కార్పొరేటర్‌గా ఎన్నికై క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారని ఆమె సేవలను కొనియాడారు. లాస్యనందిత ఆత్మకు శాంతిచేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
సదాశివపేట, ఫిబ్రవరి 23 ః రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆరూర్ మిస్కిన్బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి మండల పరిధిలోని ఆరూర్‌లో ఉన్న మిస్కిన్ బాబా దర్గాకు వచ్చినట్లు దర్గా నిర్వాహకురాలు జాహేదాబేగం తెలిపారు. ఆరోగ్యం బాగా లేకపోవడంతోఎమ్మెల్యే ఇక్కడికి వచ్చారని చెప్పారు. ఎమ్మెల్యే సోదరి సైతం ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇక్కడకు వచ్చేదని, ఆమెతో కలిసి ఎమ్మెల్యే లాస్య గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో దర్గాకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసుకుని తిరిగి ఉదయం 3.30గంటలకు వెళ్లిపోయారని చెప్పారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

