దుబ్బాక, జనవరి 6: విద్యార్థులు విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం అక్బర్పేట-భూంపల్లి మండలం నగరంలో నిర్వహించిన మండలస్థాయి విద్య, సాంస్కృతిక సంబురాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో ప్రతి భ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదా నం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే గుణాత్మక విద్యతోపాటు సకల వసతులు ఉంటాయన్నారు. ప్రభుత్వ బడులను కాపాడుకోవడంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలని సూచించారు. అక్బర్పేట-భూంపల్లి మండలంలో విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇందుకు ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.