తొగుట, అక్టోబర్ 14: రైతుహితమే ధ్యేయంగా పని చేయాలని, రైతును రాజు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తొగుట వ్యవసాయ మార్కెట్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరువుతో విలవిలలాడిన దుబ్బాక నియోజకవర్గంలో గోదావరి జలాలు పారించి సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
ఎక్కడో ఉన్న గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారా నీళ్లు నిల్వ చేసుకుంటున్నామన్నారు. రైతుకు 24 గంటల కరెంటు రైతుబంధు, రైతు బీమా అందించి ఆదుకున్నామని చెప్పారు. కరువుకాటకాలకు నిలయమైన దుబ్బాక నియోజకవర్గం నేడు పాడిపంటలకు నిలయంగా మారిందన్నారు. ఉమ్మడి జిల్లాలోనే ధాన్యం ఉత్పత్తిలో దుబ్బాక నియోజకవర్గం ముందువరుసలో నిలుస్తుందన్నారు. రైతులు ధా న్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి సద్వినియోగం చేసుకోవాలన్నారు.
చివరి శ్వాస వరకు కేసీఆర్ బాటలో సాగిన మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యంరెడ్డికి మచ్చ తీసుకురావద్దని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గ్గొనడానికి వస్తే కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం విడ్డురంగా ఉందన్నారు. రుణమాఫీ,రైతు భరోసా, కల్యాణలక్ష్మి, తులం బంగారం, ఆసరా పింఛన్లు రూ.4వేలకు పెంచలేదని అడిగితే మమ్మల్ని అడ్డుకుంటారా అని ప్రశ్నించారు.
రైతుల కోసం ము త్యంరెడ్డి పనిచేశారని, మీకు చేతనైతే మల్లన్నసాగర్ ద్వారా పంట పొలాలకు సాగునీరు అందేలా కాలువల నిర్మాణం కోసం నిధులు తీసుకురావాలన్నా రు. అభివృద్ధిని కోరుకునే ముత్యరెడ్డి బాటలో ముం దుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీపీఎం రాజయ్య, మధుసూదన్, తహసీల్దార్ శ్రీకాంత్, మండల వ్యవసాయాధికారి మోహన్, ఏపీఎం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ కార్యదర్శి స్వా మి, మహిళా సమైక్య అధ్యక్షురాలు వడ్ల మంజుల, రైతులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.