దుబ్బాక, డిసెంబర్ 6: రేవంత్ సర్కారు మరో నిజాం నిరంకుశ పాలనను తలపిస్తున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిని స్థానిక పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.
పోలీస్ నిర్బంధంలో ఉన్న ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక మీడియాతో ఫోన్లో మాట్లాడారు… రేవంత్ సర్కారు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులపై కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. రాష్ట్రంలో రజాకారుల పాలన కొనసాగుతున్నదని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, హామీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేయడం సరికాదన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రేవంత్ సర్కారుకు బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందని కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాంగ్రెస్ నాయకుల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిందని విమర్శించారు.