కోహీర్, ఆగస్టు 22: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలతో కాలయాపన చేస్తున్నారని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు విమర్శించారు. రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు గురువారం జహీరాబాద్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ గత డిసెంబర్ 9వ తేదీన రూ.రెండు లక్షల రుణమాఫీ, రూ.15వేల రైతు భరోసా, ఆసరా పింఛన్లు రెండింతలు, దివ్యాంగులకు రూ.6వేలు, ప్రతి మహిళకు రూ.2,500, నిరుద్యోగ భృతి రూ.4వేలు, రెండు లక్షల ఉద్యోగాలు, కల్యాణలక్ష్మి పథకానికి రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఒక్క పథకాన్ని అయినా అమలు చేశారా అని మండిపడ్డారు. రుణమాఫీపై సీఎం ఒక విధంగా, డిప్యూటీ సీఎం మరో విధంగా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంకోలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
రైతులందరికీ ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని సూచించారు. నీతి, నియమాలతో పాలన చేయాలన్నారు. పండబెట్టి తొక్కుతం, పేగులు మెడల వేసుకుంటం అని సీఎం మాట్లాడడం ఎంతవరకు సమంజసమన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అం దజేశారు. ధర్నాలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తం, ఆయా మండలాల అధ్యక్షులు తట్టు నారాయణ, వెంకటేశం, నర్సింహులు, నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు విజయ్‌కుమార్, గుండప్ప, నామ రవికిరణ్, అనుషమ్మ, షేక్ ఫరీద్ తదితరులున్నారు.