సిద్దిపేట, జనవరి 12: మన సంస్కృతీ సంద్రాయాలను పిల్లలకు తల్లిదండ్రులు తెలియజేయాలని,మన పండుగల గొప్పతనాన్ని వారికి వివరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని 4వ వార్డులో కౌన్సిలర్ కొండం కవితాసంపత్రెడ్డి ఆద్వర్యంలో, 9వ వార్డులో కౌన్సిలర్ సతీశ్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలకు ఆయన హాజరై అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కౌన్సిలర్లు ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రులను, గురువులను, పుట్టిన ఊరును మర్చిపోవద్దన్నారు. బతుకమ్మ, బోనాలు తెలంగాణకు గర్వకారణం అన్నారు.
అన్నం పెట్టే రైతు, పోలీసులు, వైద్యులకు మనం ఎల్లప్పుడు కృతజ్ఞతగా ఉండాలన్నారు. వీరి గురించి తెలిసేలా మహిళలు ముగ్గులు వేయడంపై హరీశ్‌రావు అభినందించారు. ఆరు గ్యారెంటీలు, పథకాలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిన తీరును మహిళల ముగ్గుల రూపంలో తెలియజేయడం భేష్ అన్నారు. సీఎం రేవంత్ మహిళలనే కాకుండా అన్ని వర్గాలను మోసం చేశాడని ఆరోపించారు. మీ అందరి ఆశీర్వాదంతో సిద్దిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించుకుని మురుగు వాసన లేకుండా చేసుకున్నామన్నారు. ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు, మోరీల వాసన ఉండేదని, నేడు సిద్దిపేట అంటే పచ్చదనం, పరిశుభ్రతకు చిరునామాగా నిలిపినట్లు గుర్తుచేశారు. మంచినీళ్లకు గోస లేకుండా చేసుకున్నామన్నారు. అన్నిరంగాల్లో సిద్దిపేటను అగ్రగామిగా నిలిపానని, రానున్న రోజుల్లోనూ ఇది కొసాగుతుందన్నారు. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు హరీశ్‌రావు బహుమతులు ప్రదానం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు, కొండం సంపత్‌రెడ్డి భూపేశ్, మేర సత్తయ్య పాల్గొన్నారు.