రామచంద్రాపురం, ఏప్రిల్ 12: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకు నడవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం తెల్లాపూర్ మున్సిపాలిటీలోని సందుగూడెం తండాలో ఎమ్మెల్యే సొంత నిధులు రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపర్చిన అంశాలతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందన్నారు. దీనికోసం సీఎం కేసీఆర్ 14 ఏండ్లు అలుపెరగకుండా పోరాడారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్‌లో 150 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అంబేద్కర్ జయంతిన సీఎం కేసీఆర్ కాంస్య విగ్రహాన్ని ప్రారంభించనున్నారన్నారు. కొత్త సచివాలయానికి సీఎం కేసీఆర్ అంబేద్కర్ పేరుని పెట్టారన్నారు. అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నారన్నారు.
పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ముఖద్వారంలో అంబేద్కర్, పంచాయతీ వద్ద గాంధీజీ, యువత కోసం ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. ఇప్పటికే 30 నుంచి 40 శాతం నియోజకవర్గంలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు. ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్‌ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దళితబంధుతో ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు యూనిట్లు అందజేయడంతో పాటు త్వరలోనే నియోజకవర్గానికి 1500 యూనిట్లను ప్రభుత్వం అందించనున్నదని తెలిపారు. దళితబంధుతో యజమానులైన దళితులు ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారన్నారు. తండా ప్రజలకోసం రూ.కోటితో ఫంక్షన్‌హాల్ నిర్మిస్తున్నామన్నారు సొంత నిధులతో నియోజకవర్గంలోని ఐదు తండాల్లో సేవాలాల్, భవాని మాత ఆలయాలను నిర్మించడం జరిగిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తు ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి, వైస్‌చైర్మన్ రాములుగౌడ్, కౌన్సిలర్లు సుచరిత కొమురయ్య, శ్రీశైలం, కోఆప్షన్ సభ్యుడు శ్రీపాల్‌రెడ్డి, సుజాత, ఏఎంసీ వైస్‌చైర్మన్ మల్లారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మధు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్రారం శంకర్, తహసీల్దార్ జయరాం, కమిషనర్ శ్రీనివాస్, ఏఈ సంజయ్, నాయకులు వెంకట్రాంరెడ్డి, ఉమేశ్, దయాకర్, ప్రభు, యాదయ్య, తండావాసులు పాల్గొన్నారు.