పటాన్చెరు, సెప్టెంబర్ 23: జిల్లా స్థాయి క్రీడోత్సవాలకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడోత్సవాలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ..వారం రోజుల క్రితమే క్రీడలు జరుగుతున్నాయని, జిల్లా స్థాయిలో క్రీడాకారులు వస్తున్నారని, వారికి భద్రత కల్పించాలని పటాన్చెరు పోలీసులకు రాతపూర్వకంగా నిర్వాహక కమిటీ దరఖాస్తు చేసుకున్నదన్నారు. కార్యక్రమం ప్రారంభసమయం వరకు పోలీసులను సంప్రదించినా భద్రత కల్పించకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు వందల మంది బాలికలు, బాలురు క్రీడోత్సవాలకు హాజరవుతుంటే వారికి భద్రత కల్పించాలని కోరినా పోలీసులు నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.
వారం రోజులపాటు జరిగే క్రీడోత్సవాల్లో ఎలాంటి ఘటనలు జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. పటాన్చెరు డీఎస్పీ, సీఐ నిర్లక్ష్యంపై రాష్ట డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేశ్, మండల విద్యాధికారి పీపీ రాథోడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మైత్రి క్లబ్ అధ్యక్షుడు హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.