సంగారెడ్డి, ఏప్రిల్ 30: సంగారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో జరుగుతున్న జాప్యంపై రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీసుకెళ్లారు. గురువారం హైదరాబాద్‌లో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి చాంబర్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో వ్యత్యాసం నెలకొన్నదని, ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని మంత్రిని కోరారు. ఎమ్మెల్యే కోటాలో కేటాయించాల్సిన ఇండ్ల మంజూరులో జాప్యం జరుగుతున్నదని వివరించారు. 40 శాతం కేటాయింపులు ఉంటాయని చెప్పినా, ఇందిరమ్మ కమిటీ ప్రమేయం లేకుండా మంజూరు జరుగుతున్నాయన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా ఇండ్లు కేటాయించాలని కోరారు.
గతంలో మంజూరైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లల్లో కొన్ని అసంపూర్తిగా ఉన్నాయని, వెంటనే నిధులు విడుదల చేసి నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రిని కోరారు. అనర్హులు అక్రమించి ఉంటే తొలిగించి అర్హులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నవించారు.
నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రైతుల నుంచి టీజీఐఐసీ భూములు సేకరిస్తోందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాలకు కనీస సౌకర్యాలు, శ్మశానవాటికలు, ప్రజా అవసరాలకు స్థలం మిగలడం లేదన్నారు. గ్రామాల భవిష్యత్ అవసరాలకు తగిన భూములు కేటాయించాలని కోరారు.
నియోజకవర్గంలోని కంది, ఆరుట్ల, పసల్వాది, ఇంద్రకరణ్ గ్రామాల్లో హెచ్ఎండీఏ భూములు తీసుకున్నదని తెలిపారు. ఎకరానికి 600 గజాలు అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పినా అమలు కాలేదన్నారు. రైతులకు రైతు భరోసా, రైతు బీమా రావడం లేదని మంత్రికి వివరించారు. సదాశివపేట మం డల పరిధిలోని పెద్దాపూర్‌లో సర్వే నంబర్ 476లో 68ఎకరాల భూమిలో రైతులు నర్సరీలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. గతంలో భూ స్వాధీనం సమయంలో రైతులకు అన్యాయం జరిగిందన్నారు.
కొండాపూర్ మండలం ఆలియాబాద్ లోని సర్వేనంబర్లు 3, 4, 83, 89, 101, 103లో 44ఎకరాల భూమిపై సమస్య ఉందన్నారు. సుమారు 40మంది రైతులు ఈ భూములను సాగు చేస్తున్నారని మంత్రికి తెలిపారు. పొరపాటున వక్ఫ్‌బోర్డు రికార్డుల్లో నమోదు కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రైతుల దగ్గర చట్టబద్ధమైన పత్రాలు ఉన్నాయని, వెంటనే వక్ఫ్రికార్డుల నుంచి తొలిగించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. సమీక్షా సమావేశంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు.