నర్సాపూర్, జూన్ 12: అభివృద్ధితో పాటు తెలంగాణ ప్రజల ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ హాజరయ్యారు. నర్సాపూర్ పట్టణంలోని పద్మజా దవాఖాన నుంచి అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాల వరకు నిర్వహించిన 2కె రన్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పాల్గొని యువకుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రన్ నిర్వహించామన్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యమని, అందరూ ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమయం కేటాయించాలని, రోజుకి కనీసం 3 కి.మీటర్లు రన్నింగ్ చేయాలని సూచించారు. పూర్వం వాహనాలు లేక నడవడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తేవి కావని తెలిపారు. సీఎం కేసీఆర్ అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేస్తూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి జరిగిన ప్రగతిని ప్రజలకు వివరించాలని ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ రన్లో యువతీయువకులు అధిక సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపాలి: అదనపు కలెక్టర్
ఫిజికల్ ఫిజ్నెస్పై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. రాష్ట్రంలో సీఎం కప్ క్రీడాపోటీలను నిర్వహించినట్లు గుర్తుచేశారు. ఈ పోటీల్లో మెదక్ జిల్లా స్టేట్ లెవల్‌కి వెళ్లిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, ఆర్డీవో శ్రీనివాసులు, సీఐ షేక్‌లాల్ మధార్, మున్సిపల్ కమిషనర్ వెంకట్‌గోపాల్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, ఎంఈవో బుచ్చానాయక్, ఎఫ్ఆర్వో అంబర్‌సింగ్, ఎస్సై శివకుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.