జహీరాబాద్, నవంబర్ 20: వేతనాల చెల్లింపులో అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నాలుగోసారి ఆందోళన బాటపట్టేందుకు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్ మిషన్ భగీరథ తాత్కాలిక కార్మికులు సిద్ధమయ్యారు. ఇటీవల వీరు ఆందోళన చేపట్టగా, ఒక నెల జీతాన్ని అందజేసి, మిగిలిన ఆరు నెలలకు సంబంధించి ఈనెల 20వ తేదీలోగా చెల్లిస్తామని సంబంధిత అధికారుల సమక్షంలో కాంట్రాక్టర్ ఒప్పంద పత్రాన్ని రాసి అందజేశారు.
ఇచ్చిన ఒప్పందం ప్రకారం బుధవారం కార్మికులకు వేతనాలను చెల్లించకపోవడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. బుధవారం అర్ధరాత్రి నుంచి రాఘవపూర్ ఫిల్టర్‌బెడ్ నుంచి గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. దీంతో జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం, అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండలాల్లో దాదాపు 75 గ్రామాల ప్రజలకు మళ్లీ క‘న్నీటి కష్టాలు’ మొదలయ్యాయి. సంబంధిత జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకుని సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.