సిద్దిపేట అర్బన్, జూన్ 6: సిద్దిపేట జిల్లాలోని మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లపై ఇంటింటి సర్వే నిర్వహించాలని అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో మిషన్ భగీరథ మొబైల్ అప్లికేషన్‌పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో సుమారు 2 లక్షల 17 వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయని..సర్వే మిషన్ భగీరథ కనెక్షన్లు, ఇతర నల్లా కనెక్షన్లు, నీరు వస్తున్న, రాని కనెక్షన్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఈ సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలని, మున్సిపాలిటీల్లో ఇంటింటికీ ఎక్కువ కనెక్షన్లు ఉంటే ఇంట్లో సభ్యుల వివరాలను ఎంట్రీ చేయాలన్నారు. మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్ల, మేజ ర్ పంచాయతీల్లో ఎంపీడీవో, ఎంపీవో మానిటరింగ్ చేయాలన్నారు. ఈ మొబైల్ అప్లికేషన్ సర్వే కోసం జిల్లాలోని ఆయా గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు, అంగన్వాటీ టీచర్లు, ఆశ వర్కర్లు దాదాపు 1200 మందికి రెండు సెషన్లలో శిక్షణ ఇస్తామని చెప్పారు. అంతకుముందు హైదరాబాద్‌లో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొబైల్ అప్లికేషన్ చేసే విధానం గురించి వివరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో రమేశ్, డీపీవో దేవకీదేవి, మిషన్ భగీరథ ఎస్ఈ శ్రీనివాసాచారి, ఈఈ గిరిధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.