మునిపల్లి, డిసెంబర్ 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్‌భగీరథ పథకం మునిపల్లి మండలంలో సత్ఫలితాలనిస్తున్నది. ఏండ్లుగా తాగునీటి ఎద్దడితో అవస్థలు పడుతున్న గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు తెలంగాణ సర్కార్ ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చి శుద్ధనీటిని సరఫరా చేస్తున్నది. గతంలో మహిళలు తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచి వ్యవసాయ బోరు బావుల్లో నీళ్లు తెచ్చుకునేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఏర్పాటు చేయించి మహిళల కష్టాలను తీరుస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న మిషన్‌భగీరథ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచింది. దీంతో, గతంలో దేశ ప్రధాని నరేంద్రమోదీ మిషన్ భగీరథ పథకంపై ప్రశంసలు కురిపించారు.
30 వాటర్ ట్యాంకులకు నీటి సరఫరా
సింగూర్ ప్రాజెక్టు వద్ద ఉన్న మిషన్ భగీరథ హెడ్‌వర్క్ నుంచి 30 వాటర్ ట్యాంకులకు నీటి సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద నీటిని శుద్ధి చేసి మొదట బుసారెడ్డిపల్లి గ్రామ శివారులో ఉన్న మిషన్ భగీరథ నీటిని శుద్ధి కేంద్రానికి విడుదల చేసి నీటిశుద్ధి అనంతరం బుధేరా చౌరస్తాలోని ట్యాంకులోకి పంపిస్తారు. అక్కడి నుంచి మండలంలోని ఆయా గ్రామాలకు నీళ్లు సరఫరా చేస్తున్నారు.
బుసారెడ్డిపల్లి మిషన్ భగీరథలో ఏర్పాటు చేసిన పంపుహౌస్
మండలంలో 11,000 నల్లా కనెక్షన్లు
మునిపల్లి మండలంలోని 30గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మండలంలో ఇప్పటి వరకు 11,000 మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. బుసారెడ్డిపల్లి, మల్లారెడ్డిపేట, మల్లికార్జునపల్లి, అల్లాపూర్, తక్కడపల్లి, హైద్లాపూర్, ఖమ్మంపల్లి, మునిపల్లి,పోల్కంపల్లి, పెద్దగోపులారం, బుధేరా, ఇబ్రహీంపూర్, కంకోల్, మేళసంగం, పెద్దలోడి, లింగంపల్లి, బొడిశెట్పల్లి, మొద్గుంపల్లి, అంతారం, పెద్దచెల్మెడ, చిన్నచెల్మెడ, బొడపల్లి, తాటిపల్లి, మన్సాన్పల్లి,పింల్లోడి, లోనికలాన్, గార్లపల్లి,చీలపల్లి,గ్రామాల్లో ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు
సరఫరా చేస్తున్నారు.
గతంలో రోడ్లపై ధర్నాలు…
ఉమ్మడి రాష్ట్రంలో మునిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మహిళలు ఖాళీ బిందెలతో ముంబై జాతీయ రహదారిపై నిరసన తెలిపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మిషన్ భగీరథ పథకం ప్రకటించి పనులు శరవేగంగా పూర్తి చేసి క్రమం తప్పకుండా ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నది తెలంగాణ సర్కార్. దీంతో మహిళలు రోడ్డెక్కాల్సిన అవసరం లేకుండా పోయింది. గడప దగ్గర ఉదయాన్నే నల్లా తిప్పితే జల సిరులు కురుస్తున్నాయి. దీంతో అక్కలు,చెల్లెలు అనందం వ్యక్తం చేస్తూ…సీఎం కేసీఆర్ పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నీటి సమస్య తీరింది..
గతంలో తాగునీటి సమస్యతో చాలా ఇబ్బందులు పడేవాళ్లం. నీళ్లు తెచ్చుకోవాలంటే కిలోమీటరు మేర నడిచి వ్యవసాయ పొలాల వద్దకు పరుగులు తీసేవాళ్లం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నీటికోసం మహిళలు ఇబ్బందులు పడకుండా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి సురక్షితమైన మంచి నీరు అందిస్తున్నారు. మహిళల కష్టాలు తొలగిపోయాయి.
– సువర్ణ, మునిపల్లి
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం…
ముంబై జాతీయ రహదారిపై ఎన్నో ఏండ్లు ధర్నాలు చేసినా ఉమ్మడి పాలకులు పట్టించుకున్న వారే లేకుండే. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టి ఇంటింటికీ నీళ్లు అందిస్తున్నారు. ఇంటి ముందే నీళ్లు పట్టుకుంటున్నాం. శుద్ధమైన నీళ్లు అందించడంతో మహిళా లోకం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటుంది. – సలోమి, ఖమ్మంపల్లి