హుస్నాబాద్ టౌన్/ కోహెడ, జూలై 17: రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామ శివారులో రైతు రామారావు భూమిలో ఆయిల్‌పామ్ మొక్కల పెంపకాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది 10 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుచేయాలని లక్ష్యం పెట్టుకున్నామని, ఉమ్మడి మెదక్ జిల్లాలో కనీసం లక్ష ఎకరాల్లో సాగుచేయాలని రైతులకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో 6 ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీల నిర్మాణం జరుగుతున్నదని, మరో 14 ఫ్యాక్టరీలు నిర్మిస్తామని మంత్రి తెలిపారు. ఖమ్మం తర్వాత సిద్దిపేట జిల్లాలోనే ఎక్కువగా ఆయిల్‌పామ్ సాగుచేస్తున్నారని, అందుకే ఈ జిల్లాకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15లోపు నర్మెటలోని ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని, రిఫైనరీ సైతం ఇక్కడే జరుగుతుందని తెలిపారు. తెలంగాణ మొత్తానికి గుండెకాయలాంటి ఆయిల్‌పామ్ రిఫైనరీ నర్మెటలో పెడుతున్నామని, ఇది హైదరాబాద్‌కు సమీపంలో ఉండడం అందరికీ కలిసి వస్తుందన్నారు. తెలంగాణ పచ్చబడాలని, కరెంట్, నీటిని ఆదాచేస్తూ ఆదాయాన్ని పెంచుకోవాలని రైతులకు సూచించారు. కలెక్టర్ జీతం కంటే గెలులు కోసేవారికి ఎక్కువగా కూలీవస్తుందనే విషయాన్ని చూశానని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రైతుభరోసా కారణంగా గౌరవెల్లి రిజర్వాయర్ పనులకు డబ్బులు ఆలస్యమయ్యాయని మంత్రి తుమ్మల చెప్పారు.
రాష్ర్ట బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ మాట్లాడుతూ.. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తిచేయడం గురించి తాను తపన పడుతున్నానని, ప్రాజెక్టు పూర్తిచేసి నీళ్లు తెచ్చే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు తెలిపారు. గౌరవెల్లి రిజర్వాయర్‌పై ఉన్న కోర్టు కేసుల గురించి అధికారులను కలుస్తున్నానని వివరించారు. ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు తప్పనిసరిగా ఆయిల్‌పామ్ సాగుచేయాలని, మనదేశానికి అవసరమైన నూనె ఉత్పత్తులు పెరగాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. వరితో పాటు అయిల్‌పామ్, డ్రాగన్ ప్రూట్, పట్టుపురుగులు పెంపకం చేపట్టాలని రైతులకు మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, జిల్లా కలెక్టర్ హైమావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, అధికారులు పాల్గొన్నారు.