అన్ని మతాలను ఆదరిస్తూ అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని ఈద్గా మైదానంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఆ తర్వాత కొండమల్లయ్య గార్డెన్లో ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మైనార్టీల సంక్షేమానికి సర్కారు ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. మైనార్టీ పిల్లల కోసం సీఎం కేసీఆర్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించారన్నారు. స్వచ్ఛ సిద్దిపేట నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్‌కు దీటుగా సిద్దిపేట ప్రభుత్వ దవాఖానను అభివృద్ధి చేశామన్నారు. కోమటి చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంతో ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి తిలకిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లో అనూహ్య స్పందన వస్తున్నదన్నారు.
-సిద్దిపేట, ఏప్రిల్ 16
సిద్దిపేట, ఏప్రిల్ 16: “సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారు… దేశంలో ఎక్కడా లేని విధంగా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు.. ప్రతి ఒక్కరూ పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ముస్లింలకు రంజాన్ తోఫా” అందజేస్తున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన సిద్దిపేట పట్టణంలోని కొండ మల్లయ్య గార్డెన్లో ముస్లింలకు రంజాన్ కానుకలను ఆయన ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌తో కలిసి ఆందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని పండుగలకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. హిందువులకు బతుకమ్మ చీరలు, క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు, ముస్లింలకు రంజాన్ తోఫా అందజేస్తున్నట్లు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యేలు, మంత్రులు స్వయంగా పాల్గొని బట్టలు అందజేస్తున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ముస్లింల పిల్లల చదువుల కోసం సీఎం కేసీఆర్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించారన్నారు.
మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మైనార్టీ పాఠశాలల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని, విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలన్నారు. అభివృద్ధిలో సిద్దిపేటను అన్నింటా ముందంజలో ఉంచామన్నారు. పట్టణంలోని మహిళలు తడి, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపాలిటీ చెత్త సేకరణ సిబ్బందికి ఇవ్వాలన్నారు. పట్టణంలో దోమల బాధలు తొలిగించేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించామన్నారు. పట్టణంలో పందులు లేకుండా చేశామన్నారు. ఇల్లు శుభ్రంగా ఉంటే సరిపోదు పట్టణం కూడా శుభ్రంగా ఉండాలన్నారు. ఖాళీ ప్లాట్లలో చెత్త వేయవద్దన్నారు. 90 శాతం మంది ప్రజలు చెత్తను వేరు చేసి ఇస్తున్నారని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి స్వచ్ఛసిద్దిపేట నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. షాదీముబారక్ పథకం ద్వారా ముస్లిం ఆడబిడ్డల పెండ్లిలకు రూ.లక్షా నూటపదహార్లు సీఎం కేసీఆర్ ఇస్తున్నారని, గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా సిద్దిపేట ప్రభుత్వ దవాఖానను తీర్చిదిద్దామన్నారు. 150 నుంచి 200 మంది వైద్యులు నిత్యం వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దన్నారు. సిద్దిపేటలో కోమటిచెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామన్నారు. కోమటి చెరువును చూడటానికి కరీంనగర్, హైదరాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి పెద్దఎత్తున జనం వస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. మైనార్టీ పిల్లల చదువుల కోసం గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, కౌన్సిలర్లు రియాజ్, మల్లికార్జున్, సాయికుమార్, నాగరాజురెడ్డి, చంద్రం, నర్సింగ్ కౌన్సిల్ మెంబర్ పాల సాయిరామ్, నాయకులు పూజల వెంకటేశ్వరరావు, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు అక్తర్ పటేల్, వజీర్, మొయిజ్, జిల్లా ఆర్టీఏ మెంబర్ ఇర్షాద్ హుస్సేన్, ఏఎంసీ వైస్ చైర్మన్ రామచందర్, తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు.