హుస్నాబాద్, జనవరి 9: మంత్రి పొన్నం ప్రభాకర్ అసత్య ప్రచారం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ హితవు పలికారు. కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడడం మంత్రి హోదాకు మంచిదికాదన్నారు. మంగళవారం సాయంత్రం హుస్నాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వినోద్‌కుమార్ అన్న కూతురు సరితారావు అనే మహిళకు జెన్కోలో ఏఈ ఉద్యోగం ఇప్పించారని ప్రచారం చేస్తున్నారని, అసలు వినోద్‌కుమార్‌కు అన్న అనే వ్యక్తి లేడని, సరితారావు అనే మహిళ వినోద్‌కుమార్‌కు బంధువే కాదన్నారు. మంత్రి హోదాలో ఉన్న పొన్నం నిజమేంటో తెలుసుకొని మాట్లాడాలన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు లేనిపోని హామీలు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచినట్లే కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్న పొన్నం కడిగిన ముత్యంలాంటి వినోద్‌కుమార్‌పై అసత్య ప్రచారం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నాడని విమర్శించారు. మంత్రిగా ఉన్న పొన్నం ఇంకా ఎమ్మెల్యేలాగానే మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. నిజాలు తెలుసుకొని మాట్లాడాలని, లేకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ఎన్నికలకు ముందు హుస్నాబాద్ నియోజకవర్గానికి మంజూరైన గిరిజన తండాల రోడ్ల నిర్మాణ నిధులు, సీడీపీ నిధులు, ఇతర అభివృద్ధి పనులకు మంజూరైన నిధులను మంత్రి పొన్నం రద్దు చేయించారని ఆరోపించారు. దీంతో చాలా అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, మంజూరైన నిధులను ఆయా పనులకు వినియోగించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.