హుస్నాబాద్, మార్చి 13: హుస్నాబాద్ నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయించినట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రూ.18.50 కోట్లతో హుస్నాబాద్ పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి, రూ.98.23 లక్షలతో హుస్నాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో వివిధ పనుల నిర్వహణ పనులకు బుధవారం హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆయన శంకుస్థాపన చేశారు. అంతకుముందు రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో రూ.50 లక్షలతో నిర్మించనున్న మండల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రితో మాట్లాడి రూ.3.50 కోట్లు, తన నిధుల నుంచి రూ.1.50 కోట్లు మొత్తం రూ.5 కోట్లను తాగునీటి ఎద్దడి నివారణకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. పట్టణంలో నిర్మించిన నూతన డిగ్రీ కళాశాల భవనంలోకి పాత భవనం నుంచి షిఫ్ట్ చేయాలని ఆదేశించామన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో 25 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని, రాష్ట్రంలో కొత్తగా వెయ్యి బస్సులను కొనుగోలు చేయబోతున్నామని తెలిపారు. 40 ఏండ్ల క్రితం నిర్మించిన హుస్నాబాద్ బస్టాండ్‌ను రూ.2 కోట్లతో ఆధునీకరిస్తున్నామన్నారు.
గౌరవెల్లి రిజర్వాయర్ కాలువ పనులను వెంటనే పూర్తి చేయించి, రైతుల పొలాలకు నీళ్లందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో త్వరలోనే ప్యూరీఫైడ్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. హుస్నాబాద్‌లో ప్రస్తుతం ఉన్న 100పడకల దవాఖానను 250పడకల దవాఖానగా అప్‌గ్రేడ్ చేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రియాంకగాంధీ ఇచ్చిన హామీ ప్రకారం హుస్నాబాద్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చేసిన బీసీ డిక్లరేషన్‌కు అనుగుణంగా 16కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
ఎన్నికలకు ముందే రాజకీయాలు ఉంటాయని, తరువాత అభివృద్ధే లక్ష్యంగా ముందుకు పోతున్నామని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల గౌరవం పెంచేలా పనిచేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనుచౌదరి, జడ్పీ వైస్‌చైర్మన్ రాజిరెడ్డి, ఆర్డీవో బెన్షాలోమ్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనితారెడ్డి, ఎంపీపీ లకావత్ మానస, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, స్థానిక కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీలు, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.