జహీరాబాద్, అక్టోబర్ 17: నియోజకవర్గ కేంద్రా ల్లో పరిపాలనా సౌలభ్యం కోసం ఎంపీ క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేయడం హర్షనీయమని రవాణా, బీసీసంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం జహీరాబాద్‌లో ఎంపీ సురేశ్‌కుమార్ షెట్కార్ క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రజా సమస్య లు సత్వర పరిష్కారానికి క్యాంపు కార్యాలయాలు దోహదపడతాయన్నారు. జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వ ధర ప్రకా రం భూసేకరణ చేపడతామని తెలిపారు.200 యూనిట్ల కరెంట్ ఉచిత కరెంట్‌కు అర్హత ఉండి రాకుంటే ఎంపీడీవో కార్యాలయాల్లో పేర్లను చెక్ చేసుకోవాలన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్, రైతులకు రూ.2లక్షల వరకు రుణామాఫీ చేశామన్నారు. రెండు లక్షలకు పైగా ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి పొన్నం అన్నారు. గురుకుల పాఠశాలలు, కళాశాలల అద్దెలు బకాయిలు ఉన్నది వాస్తవమేనని, దానికి పాఠశాలలకు తాళా లు వేయించడం, రీయింబర్స్మెంట్ కోసం కళాశాలలు బంద్ చేయడం సరికాదన్నారు.
నిరసన తెలిపే హక్కు వారికి ఉందని, కానీ..పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడంతో బస్సుల కొరత ఏర్పడిందని, మరో 1500 కొత్త బస్సులను ఆర్డర్ చేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్‌కుమార్ షెట్కార్, సెట్విన్ చైర్మన్ గిరి ధర్‌రెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్, హనుమంతురావు, రామలింగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఉజ్వల్‌రెడ్డి, ఖాజామియా, కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.