హుస్నాబాద్, ఆగస్టు 30: హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు ప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా రూపుదిద్దేందుకు కృషిచేస్తున్నామని, ఉత్తర తెలంగాణకే తలమానికంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్‌లో రూ.45లక్షలతో నిర్మించే పద్మశాలీ సేవాసంఘం కమ్యూనిటీ భవనం, రూ.85లక్షలతో ఎల్లమ్మ చెరువు కట్ట అభివృద్ధి పనులకు, రూ.20లక్షలతో సిద్ధేశ్వర గుడి వరకు రోడ్డు నిర్మాణ పనులకు, తన తండ్రి స్మారకార్థం ఎల్లమ్మ ఆలయ ఆవరణలో వసతి మండప నిర్మాణాలకు శుక్రవారం కలెక్టర్ మనుచౌదరితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
అంతకు ముందు పీఏసీఎస్ నూతన కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ.. హుస్నాబాద్ పట్టణంలో గతంలో జరిగిన అభివృద్ధితో పాటు ఇంకా అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళిక ద్వారా ముందుకు పోతామన్నారు.
మడేలయ్య దేవాలయం, మున్నూరు కాపు సంఘం భవనం, రెడ్డి సంఘం భవనం, ముదిరాజ్ సంఘం భవనం, మైనార్టీ, హమాలీ సంఘాల భవనాలకు ఒక్కోదానికి రూ.45లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్, ఏసీపీ కార్యాలయాలు, మాతాశిశు దవాఖాన భవనాలను త్వరలోనే ప్రారంభించుకుంటామని చెప్పారు.
చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, చేనేత కార్మికుల పెండింగ్ నిధులను విడుదల చేసిందన్నారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా మరిన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేయబోతున్నదని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మనుచౌదరి కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్ చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు అధికారులు పాల్గొన్నారు.