కొల్చారం, జూన్ 19: విద్యతో సామాజిక అంతరాలు తగ్గుతాయని పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా కొల్చారంలో బడిబాట ముగింపు, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యే సునీతారెడ్డి, కలెక్టర్ రాహుల్‌రాజ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పేద విద్యార్థులకు మెరుగైన వసతులతో నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి ఎంతోమంది ఉన్నతశిఖరాలు అధిరోహించారన్నారు. బడిబాట విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యనభ్యసించాలని కోరారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు చేపడుతుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వసతులు, సదుపాయాలతోపాటు బోధనలో విప్లవాత్మక మార్పులు, చర్యలు చేపడుతున్నామన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న ఐదేండ్లు పైబడిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేల చర్యలు తీసుకోవాలన్నారు.
పిల్లలు ప్రభుత్వ బడుల్లో చేరేలా విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు కృషి చేయాలన్నారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు 90శాతం పూర్తయ్యాయని, వారంలోగా వందశాతం పూర్తవుతాయన్నారు. అనంతరం కొల్చారం మండలంలో రూ.కోటి 20లక్షలతో నిర్మించనున్న ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. పోతన్‌శెట్టిపల్లి సమీపంలోని జూలగుట్ట వద్ద రూ.2లక్షల 50వేలతో నిర్మించనున్న బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆవుల రాజిరెడ్డి, రెడ్డిపల్లి ఆంజనేయులు, సోమన్నగారి రవీందర్‌రెడ్డి, సుహాసినిరెడ్డి, ఎస్పీ బాలస్వామి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, విద్యాధికారి రాధాకిషన్, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, జడ్పీసీఈవో ఎల్ల య్య, జడ్పీటీసీ మేఘమాలాసంతోశ్కుమార్, ఎంపీపీ మంజులాకాశీనాథ్, గౌరీశంకర్గుప్తా, కోనాపూర్ సంతోశ్‌రావు, రాజాగౌడ్, నరేందర్‌రెడ్డి, బాగారెడ్డి, యాదాగౌడ్, రవితేజరెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు.