‘ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేశాం. సీఎం కేసీఆర్‌ను ఒప్పించి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఎట్టకేలకు సాధించారు.’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పలువురు లబ్ధిదారులకు గృహలక్ష్మి మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 45 కోట్లు నిధులు మంజూరు చేశామని, త్వరలోనే పనులు పూర్తవుతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గద్దెనెక్కుతారని, న్యాయం చేసే వారికే పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రాంత ప్రజల ఏండ్ల కల నెరవేరిందని, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు జీవిత కాలం రుణపడి ఉంటానని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు.
రామాయంపేట, అక్టోబర్ 2: ఇక్కడి ప్రజల కోసంమే రామాయంపేట డివిజన్‌ను ఏర్పాటు చేశామని, ఇచ్చిన మాట నెరవేర్చుకున్నామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం రామాయంపేట పట్టణంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి రెవెన్యూ డివిజన్‌ను ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం గృహలబ్ధి లబ్ధ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఐదేండ్లుగా రామాయంపేట రెవెన్యూ డివిజన్‌గా చేయాలంటూ మన మిత్రులు రాస్తారోకోలు, ధర్నాలు కూడా చేశారని గుర్తు చేశారు. డివిజన్ కోసం దీక్షలో ఉన్నప్పుడు తాను తప్పకుండా ఎక్కడ డివిజన్ ఏర్పడిన రామాయంపేటను కచ్చితంగా డివిజన్ చేస్తామని మాటిచ్చామని, ఆ మాట ప్రకారం సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే పద్మక్క, తాను కలిసి ఒప్పించి డివిజన్ తీసుకువచ్చామన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.45 కోట్లను టీయూఎఫ్ఐడీసీ ద్వారా మంజూరు చేయించామన్నారు.
ఆ నిధులతో ఈ రోజే ప్రారంభించామని, త్వరలోనే పనులు పూర్తి అవుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఊసరవెల్లి రాజకీయాలు చేసి మరోసారి జనాలను ముంచాలని చూస్తుందని, ఎప్పటికీ కాంగ్రెస్‌కు ప్రజలు అవకాశం ఇవ్వరని, కావల్సింది బీఆర్ఎస్, సీఎం కేసీఆరే అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. 70 ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం అదోగతి పాలైందన్నారు. కాంగ్రెస్ నాయకులు స్కాంలు చేస్తూ అడ్డంగా బుక్కయ్యారని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. ఆ పార్టీకి కాసుల గలగలనే తప్ప ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచనే ఎప్పుడూ రాదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా సీఎం కేసీఆర్ సమక్షంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. నేడు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
మెదక్ జిల్లా కేంద్రం కోసం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కృషి చేసి మెదక్‌ను జిల్లా కేంద్రంగా దక్కించుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లో డబ్బు సంచులకు ఓట్లు పడవని జనాల్లో ఉన్న జనాకర్షక పథకాలతో సీఎం కేసీఆరే మళ్లీ సీఎంగా గద్దెను ఎక్కుతారన్నారు. ఈ పోరాటం ధర్మానికి, న్యాయానికి జరిగే పోరాటమని ప్రజలు న్యాయం చేసే వారికే పట్టం కట్టాలని సూచించారు. పద్మక్క పట్టు విడువని విక్రమార్కుడిలా నా రామాయంపేట అభివృద్ధికి నిధులు కావాలంటూ మొండి పట్టు పట్టిందన్నారు. అందుకోసం సీఎం కేసీఆర్ మెదక్‌లో జరిగిన సభలో నా బిడ్డ పద్మకు ఏదడిగినా కాదనను., నా బిడ్డ అడిగింది డివిజన్, డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నానన్నారు. రేపే డివిజన్ ప్రక్రియ జీవోను పంపిస్తున్నానని సభలో చెప్పి తెల్లారే వరకు మెదక్, రామాయంపేట ప్రభుత్వ కార్యాలయాలకు జీవోలు అందజేశారని గుర్తు చేశారు.
నా డివిజన్ కల నెరవేరింది
– మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
నా డివిజన్ కల సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సహకారంతో నెరవేరిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. డివిజన్ కోసం రామాయంపేట ప్రాంత ప్రజలు కొన్నేండ్ల కాలంగా ఎదురు చూశారని, వారిని మంత్రి వద్దకు తీసుకెళ్లి డివిజన్ ఏర్పాటు చేయాలని కోరినట్లు గుర్తు చేశారు. దీంతో సీఎం కేసీఆర్ మెదక్‌లో జరిగిన బీఆర్ఎస్ సభలో ప్రకటించారని, అదేవిధంగా డిగ్రీ కళాశాల కూడా మంజూరు చేశారన్నారు. రామాయంపేట పట్టణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు నిధులు మంజూరు చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు జీవిత కాలం రుణపడి ఉంటామన్నారు. రామాయంపేట డివిజన్లో రామాయంపేట పట్టణంతోపాటు చిన్నశంకరంపేట, నార్సింగి, నిజాంపేట మండలాలపై ప్రత్యేక దృష్టికి పెట్టి అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు.
పద్మక్కది పల్లెటూరి మాట
– ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిది పల్లెటూరి మాట. ఆమె యాస భాషలకు ప్రజలు తొందరగా ఆకట్టుకుంటారు. ప్రజల్లో మమేకమై నేను సైతం మీ ఆడబిడ్డను అంటూ ప్రజల ముందుకు వెళ్తుందని ప్రముఖ కవి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. రామాయంపేట కార్యక్రమంలో మాట్లాడారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పట్టు విడువని నాయకురాలని కొనియాడారు. ఆమె మాటంటే పని కావల్సిందేనని, తెలంగాణ ఉద్యమం నుంచి పనిచేసిన పద్మక్కకు రామాయంపేట, మెదక్ ప్రాంతాల్లో అనువనువు గుర్తుండిపోయేలా పని చేసిందన్నారు. మెదక్‌కు జిల్లా కేంద్రంగా రైలు కూత వినిపించిన ఘనత పద్మాదేవేందర్‌రెడ్డికి దక్కిందన్నారు. పద్మక్కను మీరంతా ఇదే ఊపుతో మళ్లీ గెలిపించాలని కోరారు. ఆమె మాట రామాయంపేట ప్రాంత ప్రజలకు శిరోధార్యం అని ఆమె మీకు ఆడబిడ్డలా ఉంటుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మెదక్ కలెక్టర్ రాజర్షి షా, మెదక్ ఆర్డీవో, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మెదక్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్, పల్లె జితేందర్‌గౌడ్, వైస్ చైర్మన్లు పుట్టి విజయలక్ష్మి, మల్లికార్జున్‌గౌడ్, నిజాంపేట ఎంపీపీ సిద్దిరాములు, పీఏసీఎస్ చైర్మన్లు అందె కొండల్‌రెడ్డి, బాదె చంద్రం బాపురెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, గజవాడ నాగరాజు, చలిమెటి నాగరాజు, కిష్టారెడ్డి, మాజీ ఎంపీపీ బిజ్జ సంపత్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పుట్టి యాదగిరి, సరాఫ్ యాదగిరి, దేవుని రాజు, దేమె యాదగిరి, సుందర్‌సింగ్, శ్యాంసుందర్, ఎస్కే అహ్మద్, పాతూరి ప్రభావతి, హస్నోద్దీన్, గులాం, ఇమ్రాన్, పుట్టి అక్షయ్, ఉమా మహేశ్వర్, సిద్దిరాములు, ఇమ్మానియేల్, చంద్రకళ, పంబాల జ్యోతి తదితరులున్నారు.