సిద్దిపేట, ఫిబ్రవరి 21 : ‘భూసారాన్ని కాపాడుకుంటేనే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లేనని, చెత్తను వెల్త్ ఆఫ్ వేస్ట్‌గా మార్చుకోవడం సిద్దిపేట మున్సిపాలిటీ గొప్పతనం.. భూమిత్ర అంటే భూమికి మిత్రులుగా మారాలి. మనిషి ఆరోగ్యానికి భూమికి అవినాభావ సంబంధం ఉంటుంది. భూమి బాగుంటే మనిషి బాగుంటాడని’ ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పత్తి మార్కెట్ ఆవరణలో ‘భూమిత్ర మన తడి చెత్త-మన సేంద్రియ ఎరువు-మననేల’ సిద్దిపేట బ్రాండ్‌తో సంపన్న సేంద్రియ ఎరువుల గోదాంను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలం మా రిందని, ఎనుకట రెండు పూటల అన్నం తినడం ఉండేదని, ఈ రోజుల్లో పేదలు రెండు పూటలా అన్నం తింటుంటే, డబ్బున్న వాళ్లు గంజి, గట్కా, రొట్టెలు తింటున్నారని గుర్తుచేశారు. సిద్దిపేట మున్సిపాలిటీ పట్టణంలోని 42,322 ఇండ్ల నుంచి నిత్యం తడి చెత్త వేర్వేరుగా ఇవ్వడంతో భూమిత్ర ఎరువు సాధ్యమైందని మంత్రి వెల్లడించారు. సిద్దిపేటలో రోజూ 34 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నదన్నారు. ఇందులో తడి చెత్త 27 లక్షల మెట్రిక్ టన్నులు, 4 మెట్రిక్ టన్నుల పొడి చెత్త, మిగతాది హానికరమైన చెత్త వస్తున్నదని వివరించారు.
తడి చెత్తను ఎరువుగా, పొడి చెత్తను రిసైక్లింగ్‌కు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను సిమెంట్ కర్మాగారానికి విక్రయిస్తున్నట్లు తెలిపారు. చెత్తను వెల్త్ ఆఫ్ వేస్ట్‌గా మార్చుకోవడం సిద్దిపేట మున్సిపాలిటీ గొప్పతనమని అభివర్ణించారు. ప్రతినెలా 4500 కిలోల గ్యాస్ తయారు చేస్తున్నామని, ప్రతినెలా 100 మెట్రిక్ టన్నుల ఎరువుల ఉత్పత్తి అవుతున్నదని, గ్యాస్ ద్వారా 3 లక్షలు, ఎరువుల ద్వారా 7.3 లక్షల ఆదాయం, పొడి చెత్త ద్వారా 11.30 లక్షల ఆదాయం మొత్తం 21 లక్షల ఆదాయం సిద్దిపేట మున్సిపల్‌కు సమకూరుతున్నదన్నారు. ఆయిల్‌పామ్ ఒక్కో మొక్కకు రెండున్నర కిలోల సేంద్రియ ఎరువు వాడకం మంచిదన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ అనే రైతుకు డాక్టర్ స్వామి ఎకరం పొలానికి అవసరమైన సేంద్రియ ఎరువును ఉచితంగా అందజేశారు.
సిద్దిపేట బ్రాండ్.. తొలి రైతు మంత్రి
సిద్దిపేట బ్రాండ్ పేరుతో తయారు చేసిన జీవ సంపన్న సేంద్రియ ఎరువును మంత్రి హరీశ్‌రావు రూ.37 వేలు చెల్లించి 125 బ్యాగులు కొనుగోలు చేశారు. రైతులు, ప్రజలకు నమ్మకం కలిగిం చేందుకు, ఆలోచించి మంత్రి హరీశ్‌రావు ఎరువును కొనుగోలు చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మచ్చ విజితా వేణుగోపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మంజులారాజనర్సు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, ఎంపీపీ మాణిక్యరెడ్డి, ఎఎంసీ చైర్మన్లు రాగుల సారయ్య, వనితా రవీందర్‌రెడ్డి, నాయకులు తుపాకుల బాల్‌రంగం, శ్రీకాంత్‌రెడ్డి, సోమిరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, పర్యావరణవేత్త డాక్టర్. శాంతి, ప్రజాప్రతినిధులు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్ పంపిణీ
సిద్దిపేట మార్కెట్ యార్డు ఆవరణలో వ్యవసాయ స్ప్రేయర్లను మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేశారు. వ్యవసాయ పరికరాలు చిన్న, సన్నకారు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మండల సమాఖ్య ఆధ్వర్యంలో కస్టమ్ హెరింగ్ సెంటర్స్-వ్యవసాయ పరికరాల అద్దె కేంద్రం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో 21 మండల సమాఖ్యలు-రాయపోల్, సిద్దిపేట అర్బన్ మినహా సీహెచ్‌సీలను రూ.3.05 కోట్లతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో 75 శాతం ఎంఎస్ సొంత నిధులు రూ.2.09 కోట్లు, 25 శాతం ఎస్ఆర్ఎల్ఎం రూ.96 లక్షలు వెచ్చించినట్లు వివరించారు. జిల్లాలోని నాలుగు మండలాల్లో డ్రోన్ స్ప్రేయర్లు ఏర్పాటుకు కోహెడ, నారాయణరావుపేట, బెజ్జంకి, గజ్వేల్‌లో ప్రణాళిక చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కోహెడ మండల సమాఖ్యకు రూ. 9.63 లక్షలు అందజేశారు.
సేంద్రియ ఎరువుతో నేల సారవంతం
నేను రెండేండ్ల నుం చి సేంద్రియ ఎరువును వాడుతున్నా. మాపొ లంలో కూరగాయలు, క్యారెట్ ఇతర పం టలు సాగుచేశాం. ఈ ఎరువు వాడడంతో నేల సారవంతంగా ఉంటుంది. బాగా పనిచేస్తుంది. పంటలు బాగా వస్తాయి. రసాయన ఎరువుల వాడకం తగ్గించాం. సేంద్రియ ఎరువులను వాడుతున్నాం.
-వెంకటేశ్వరప్ప, రైతు బెంగళూరు